రెండేళ్ల క్రితం అల్లు అర్జున్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ తెరకెక్కించిన డీజే సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే తాను ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో దర్శకుడు హరీష్ శంకర్, తన తదుపరి సినిమాని ఖచ్చితంగా హిట్ చేయాలనే తలంపుతో కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వరుణ్ తేజ్ తో తెరకెక్కించిన సినిమా వాల్మీకి. తమిళ్ లో ఇటీవల  కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో బాబీ సింహ, సిద్దార్థ ప్రధాన పాత్రల్లో రూపొందిన జిగర్తాండ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిసారి కెరీర్ లో గద్దలకొండ గణేష్ అనే పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు వరుణ్ తేజ్. 

ఇప్పటివరకు తాను చేసిన సినిమాల్లోని పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ సినిమాలోని గణేష్ పాత్ర మరొక ఎత్తని, ఇక దర్శకుడు హరీష్ ఈ పాత్రను మన తెలుగు నేటివికి తగ్గట్లు మరింత పవర్ఫుల్ గా మార్చారని ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వరుణ్ మాట్లాడుతూ చెప్పారు. ఒకరకంగా ఈ సినిమా అటు హరీష్ శంకర్ కు, ఇటు వరుణ్ తేజ్ కు పెద్ద అగ్ని పరీక్షే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమాను దర్శకుడు హరీష్ ఎంతో కష్టపడి జాగ్రత్తగా తెరకెక్కించడం జరిగిందని, అలానే హీరో వరుణ్ తేజ్ కూడా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసారని, రేపు రిలీజ్ తరువాత సినిమా తప్పకుండా మంచి సక్సెస్ ని సాధించి తీరుతుందని అంటోంది వాల్మీకి యూనిట్. 

వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ, మృణాళిని రవి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, అచ్చ తెలుగు అమ్మాయి డింపుల్ హయతి, ఈ సినిమాలోని జర్ర జర్ర అనే మాస్ పాటలో హీరో వరుణ్ తో కలిసి చిందేయనుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ వీక్షకులను విపరీతంగా అలరించడంతో పాటు, సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. మరొక్క రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న వాల్మీకి, ఏ మేర విజయాన్ని అందుకుంటాడో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: