ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలు కూడా ఒకదానిని మించి మరొకటి ఎంతటి అద్భుత విజయాలు అందుకున్నాయో అందరికి తెలిసిందే. పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కిన ఆ సినిమాలు, కేవలం తెలుగు వారినే కాక, పలు ఇతర భాషల వారిని కూడా ఎంతో ఆకట్టుకోవడం, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ ని రాబట్టడం జరిగింది. ఇకపోతే ఆ సినిమాల తరువాత ఇటీవల ప్రభాస్ నటించిన సాహో కూడా అదే విధమైన పాన్ ఇండియా కథాంశంతోనే తెరకెక్కింది. అయితే ఆ సినిమా ఇక్కడ పెద్దగా ఆడకపోయినప్పటికీ నార్త్ లో మాత్రం మంచి కలెక్షన్స్ సంపాదించింది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా పాన్ ఇండియా ఫీల్ ఉన్న కథాంశమే కావడంతో మన దేశంతోపాటు ఈ సినిమాపై ఇతర దేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. 

మరోవైపు మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సైరా నరసింహ రెడ్డి కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి, అతి త్వరలో దేశవ్యాప్తంగా భారీ లెవెల్ లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. మరి వీరందరూ పాన్ ఇండియా ఫీల్ ఉన్న సినిమాలు చేస్తూ, దేశ విదేశాల్లో కూడా తమ క్రేజ్ మరియు మార్కెట్ ని మరింతగా విస్తృతం చేసుకుంటూ పోతుంటే, టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న స్టార్స్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం అటువంటి సినిమాల విషయమై ఊసెత్తకపోవడం ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. నిజానికి ఇప్పటివరకు ఒక్క పరభాషా సినిమాలో నటించని మహేష్ కు బాలీవుడ్, కోలీవుడ్ లలో విపరీతమైన క్రేజ్ ఉంది. 

అలానే ఇటీవల నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ కాంటెస్ట్ లో మహేష్, బాలీవుడ్ ఖాన్స్ తరువాత స్థానంలో నిలిచి, ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా దేశవ్యాప్తంగా పేరు సంపాదించడం జరిగింది. మరి ఇంత క్రేజ్ ఉన్న మహేష్, బాలీవుడ్ ఊసెత్తితే చాలు, అక్కడకి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇటీవల మహేష్, కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఒక సినిమా కథ విని, ఓకె చేసినట్లు సమాచారం. అలానే ఆ సినిమా మంచి పాన్ ఇండియా అపీల్ తో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే తెలుగుతో పాటు మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పటివరకు పాన్ ఇండియా ఫీల్ ఉన్న సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. మహేష్ ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది కాబట్టి, అతి త్వరలో బన్నీ కూడా అటువంటి కథాంశం ఉన్న సినిమాలను ఎంపిక చేసి నటిస్తే, తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తారని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి మిగతావారి వలే ఈ ఇద్దరు హీరోలు అటువంటి పాన్ ఇండియా సినిమాల్లో ఎప్పుడు నటిస్తారో ఏమో అని ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: