ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్ మరియు ఆరు పలకల దేహదారుడ్యం కలిగిన హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలుగా రామాయణం స్క్రిప్టు రెడీ అయిపోయిందట. బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారి మొన్ననే రిలీజ్ అయిన 'చిచోరె' చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి మరియు శ్రద్ధాకపూర్ నటించారు. అయితే ఈ చిత్ర దర్శకుడు తన తదుపరి చిత్రం అయిన 'రామాయణ' మీద ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయాడు. 

మూడు భాగాలుగా విడుదల చేయనున్న ఈ చిత్రం దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతోందట. అదే కనుక జరిగితే భారతదేశ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన సినిమాగా 'రోబో 2.0' ని అధిగమిస్తుంది 'రామాయణ'. ఇప్పటికే నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ ను రాముడిగా మరియు దీపికా పడుకొనే ను సీత పాత్రలో కన్ఫార్మ్ చేసేశారట. మరి రాముడు, సీత ఉన్నప్పుడు రావణాసురుడు లేకుండా ఎలా? అందుకే ఆ పాత్ర కోసం మన రెబల్ స్టార్ ప్రభాస్ ను ప్రస్తుతానికి అనుకున్నారట. ప్రభాస్ పర్సనాలిటీకి రావణాసురుడి క్యారెక్టర్ సరిగ్గా సూట్ అవుతుందని బాహవించిన ఇప్పటికే చిత్రబృందం ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

విశేషమేమిటంటే ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఒక చేయి వేయబోతున్నాడట. నితేష్ తివారి దర్శకత్వంలో రానున్న ఈ పౌరాణిక మహాగాథని అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా మరియు మధు మంతెన కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పౌరాణిక రావణుడిగా కాకపోయినా ఆధునిక రావణుడిగా 'జై లవ కుశ' లో అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ కనుక రావణుడి పాత్ర చేసేందుకు ఒప్పుకుంటే మాత్రం తెలుగు సినిమా ఆడియన్స్ కు అది కచ్చితంగా పెద్ద పండుగే.


మరింత సమాచారం తెలుసుకోండి: