ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల థాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా తయారు అయ్యాయి..దాంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  అయితే ఏ ప్రభుత్వం వచ్చిన ప్రధాన రోడ్లు తప్ప నివాసయోగ్యంగా ఉన్న రోడ్ల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని ఎన్నో ఆరోపణలు, అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కానీ ఏదో తూ తూ మంత్రంగా పనులు కానిస్తున్నారే తప్ప సరైన రీతిలో వాటి పరిష్కారం మాత్రం చూపడం లేదు. 

హైదరాబాద్ లో చాలా రోడ్ లు వర్షాలు కురిసినప్పుడు చాలా దారుణంగా ఉంటూంటాయి. ఆ విషయమై చాలా కంప్లైంట్స్ వస్తూంటాయి.  ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో గతంలో నందమూరి బాలకృష్ణ తో ‘సింహా’లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి నిర్మాతగా వ్యవహరించిన  పరుచూరి శివ రామప్రసాద్ జీహెచ్ఎంసీ అధికారుల తీరును నిరసిస్తూ దీక్షకు దిగారు. ఆయన ఉంటున్న వీధిలో వర్షం కురిసిన సమయంలో మోకాలి లోతు నీరు నిలువ ఉంటోంది. ఈ విషయాలను ఆధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేశారు.

రోడ్డు పక్కన కంకర పోశారు..కానీ రోడ్డు మరమ్మత్తు పనులు మాత్రం చేయలేదు..ఈలోగా వర్షాలు కురిసి రోడ్డు నానా బీభత్సం అయ్యింది. సోమవారం రాత్రి కంకరకుప్పల కారణంగా ప్రసాద్‌ కిందపడి గాయపడ్డారు. దీంతో సోమవారం రాత్రి నుంచి అక్కడే బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. రోడ్డు పనులు చేపట్టే వరకు కదిలేది లేదని అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. దాంతో ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం..వార్తలు రావడంతో ఇక లాభం లేదని జీహెచ్ఎంసీ వెంటనే స్పందించి పనులకు శ్రీకారం చుట్టడంతో ఆయన దీక్ష విరమించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: