నాగచైతన్య, వెంకటేష్ కాంబినేషన్లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా వెంకీమామ. దసరాకు విడుదల చేద్దామని భావించిన ఈ సినిమాను ఆ తరువాత అక్టోబర్ 25వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారని మొదట వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా ఇప్పటికే పూర్తయింది. 
 
వెంకటేష్, నాగచైతన్య ఈ సినిమాలో మమాఅల్లుళ్లుగా కనిపించబోతున్నారు. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఒక షాకింగ్ అప్ డేట్ బయటకొచ్చింది. వెంకటేష్ ఈ సినిమాలో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్ర సినిమా క్లైమక్స్ లో చనిపోతుందని తెలుస్తుంది. సాధారణంగా తెలుగు సినిమాల్లో ప్రేక్షకులు ఇలాంటి క్లైమాక్స్ లు ఇష్టపడరు. 
 
కొన్ని సందర్భాల్లో మాత్రమే ట్రాజెడీతో కూడిన క్లైమాక్స్ హిట్టైన సందర్భాలు ఉన్నాయి. మరి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి క్లైమాక్స్ ను ఇష్టపడతారా అంటే చెప్పలేం. ఈ సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు తీశారని కూడా మరో వార్త వినిపిస్తుంది. ఒక క్లైమాక్స్ లో వెంకటేష్ మరణం అంచుల వరకు వెళ్లి బయటపడతాడని మరో క్లైమాక్స్ లో చనిపోతాడని తెలుస్తుంది. కొన్ని చర్చల అనంతరం క్లైమాక్స్ ఫైనల్ చేసే అవకాశం ఉందని సమాచారం. 
 
మేనల్లుడి గండం అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. జై లవ కుశ సినిమా తరువాత బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తోంది. గతంలో నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకటేష్ ఒక స్పెషల్ పాత్రలో నటించాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఫుల్ లెంత్ పాత్రలో కనిపిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: