విడుదలకు ముందు ఆఖరి నిముషంలో వివాదాలకు భయపడి ‘వాల్మీకి’ మూవీ టైటిల్ ను ‘గద్దలకొండ గణేష్’ గా మార్చిన పరిస్థితులలో దర్శకుడు హరీష్ శంకర్ విపరీతమైన భావోద్వేగానికి లోనయ్యాడు. నిన్నరాత్రి చాల ప్రొద్దుపోయాక ఈ విషయానికి సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో హరీష్ శంకర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

‘వాల్మీకి’ పట్ల గౌరవంతో ఈ మూవీకి ఈ టైటిల్ ను పెట్టిన విషయాన్ని వివరిస్తూ ఒక హిందువుగా పుట్టినందుకు నేను ఓడిపోయాను అంటూ వివాదాస్పద కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఒక కులం ఒక వర్గం పేరుతో వివాదాలు సృష్టించుకోవడం ఎవరికీ మంచిది కాదనీ ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఈ దేశంలో కుల వ్యవస్థ శాస్వితంగా కొనసాగే ఆస్కారం ఉంది అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు. 

తన తండ్రి సినిమాలు చూడడు అని చెపుతూ ‘వాల్మీకి’ టైటిల్ పై జరుగుతున్న వివాదాన్ని తెలుసుకుని నిజంగా దేశంలో బావ వ్యక్తీకరణ స్వేచ్చ ఉందా అంటూ తనను ప్రశ్నించిన విషయాలను బయట పెట్టాడు. ఈ మూవీ టైటిల్ మార్చకుండా న్యాయ పోరాటం చేసే సమర్ధత తనకు ఉన్నా ఈ వివాదాల వల్ల ఈ మూవీని కొనుక్కున్న బయ్యర్లు నష్టపోకూడదు అన్న ఉద్దేశ్యంతో తాను టైటిల్ మార్పుకు అంగీకరించిన విషయాన్ని తెలియచేసాడు.

భారతదేశం ఏ విషయంలో అభివృద్ధి చెందకపోయినా ‘ఇగో’ల విషయంలో ఎంతో అభివృద్ధి చెందింది ఇలాంటి ఇగోలు సమాజానికి హాని చేస్తాయి అని అభిప్రాయ పడ్డాడు హరీష్ శంకర్. ఈ సినిమాను విడుదల అయిన తరువాత చూసి ‘వాల్మీకి’ సామాజిక వర్గ నేతలు తమ అభిప్రాయాలు మార్చుకుంటారని ఆశిస్తున్నాను అంటూ భావోద్వేగంతో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ నిన్న రాత్రి జరిగిన మీడియా సమావేశానికి హైలెట్ గా మారడమే కాకుండా హరీష్ శంకర్ ఆవేదనకు నిదర్శనంగా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: