మెగా హీరోలకు అచ్చొచ్చిందే మాస్ గెటప్పులు, డైలాగులు. చిరంజీవి మెగాస్టార్ అయింది కూడా అదే మాస్ తో. అదే ఒరవడిలో మెగా హీరోలు కూడా వెళ్లాల్సిందే. మెగా ఫ్యాన్ బేస్ అలాంటిది మరి. కానీ.. మెగా క్యాంప్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ తనదైన పంథాలో వెళుతున్నాడు. ముకుందా నుంచి ఇప్పటి వాల్మీకి వరకూ తీసుకుంటే తానేం చేస్తున్నాడో ఓ క్లారీటీ ఉన్నట్టే ఉంది. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్తున్నాడు.


ఈరోజు విడుదలైన వాల్మీకి సినిమా చూస్తే అదే అర్ధమవుతోంది. ఇప్పటి వరకూ విభిన్న క్యారెక్టర్లతో సినిమాలు చేసాడు వరుణ్ తేజ్. తొలిసారి మాస్ అండ్ రఫ్ గెటప్ లో, మాస్ మ్యానరిజమ్స్ తో పూర్తిస్థాయి మెగా హీరోగా నటించి మెప్పించాడు. డైలాగ్ డిక్షన్ లో గానీ, ఎక్స్ ప్రెషన్స్ లో కానీ ఎక్కడా తడబాటు లేకుండా ఈ స్థాయి పెర్ఫార్మెన్స్ చేయడం గొప్ప విషయమే. ముకుందాలో స్టూడెంట్ గా నటించాడు. లోఫర్ లో మాస్ క్యారెక్టర్, కంచెలో మిలిటరీ, ఫిదాలో లవర్, ఎఫ్2లో కామెడీ, అంతరిక్షంలో సాఫ్ట్ క్యారెక్టర్.. ఇలా దేనికదే డిఫరెంట్ వేరియేషన్లున్న క్యారెక్టర్లు ఎంచుకుంటూ మెగా ఫ్యామిలీ హీరోలకు భిన్నంగా అడుగులు వేస్తున్నాడు. చేసిన ప్రతి క్యారెక్టర్ ను హిట్ ఫ్లాప్ లకు అతీతంగా 'బాగా నటిస్తున్నాడు.. మంచి క్యారెక్టర్లు వేస్తున్నాడు' అనే పేరు తెచ్చుకుంటున్నాడు. చిరంజీవి తర్వాత ఇన్ని వేరియేషన్లున్న క్యారెక్టర్స్ ఇంత తక్కువ కాలంలో మెగా కుటుంబంలో చేసిన హీరో వరుణ్ ఒక్కడే అని చెప్పక తప్పదు.


నిజానికి వరుణ్ తేజ్ ఎంచుకున్న దారి మంచిదే. ఇలా చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయటానికి అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి పాత్రలకు దర్శక, నిర్మాతలకు, రచయితలకు ఆప్షన్ అవుతాడు. ఒకప్పుడు గజినీ, అపరిచితుడు, శివపుత్రుడు.. లాంటి సినిమాలకు తెలుగులో ఎవరు అనే ప్రశ్నకు జవాబు లేదు. వరుణ్ ఇదే దారిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తే ఈ ప్రశ్నకు తెలుగులో సమాధానం దొరికినట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: