వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిలీజ్ కి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిత్ర బృందం చివరికి వాల్మీకి పేరును గద్దలకొండ గణేష్ గా మార్చారు. సినిమా రిలీజ్ రేపనగా ఇలా సినిమా పేరు మార్చవలసి రావడం దురదృష్టకరం. అయితే దీని మీద ఎవరి వాదనలు ఎలా ఉన్నా పేరు మార్పు సినిమా విజయాన్ని మార్చలేదని అర్థం అవుతుంది.


దర్శకుడు హరీష్ శంకర్ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హరీష్ శంకర్ మాస్ మంత్రాన్ని బాగానే ఒంట బట్టించుకున్నాడు. విజయాలు లేని పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ అందించాడు. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నుండి వచ్చే డైలాగులు ఇప్పటికీ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పనిలేదు. ఒక రీమేక్ చిత్రాన్ని తనదైన శైలిలో తీర్చిదిద్ది అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.


ఇప్పుడు వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా మరోసారీ రీమేక్ సినిమానే ఎంచుకున్నప్పటికీ, సినిమా తీసిన విధానం అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ లాంటి హీరో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం ఈ సినిమాకి అతిపెద్ద హైలైట్. ఇప్పటి వరకు వరుణ్ చేసినవన్నీ సాఫ్ట్ క్యారెక్టర్లే. అలాంటిది వరుణ్ ఈ క్యారెక్టర్ చేయగలడని దర్శకుడు నమ్మడమే కాకుండా, హీరోని ఒప్పించడం కూడా ఆశ్చర్యమే!


గద్దలకొండ గణేష్ గా వరుణ్ తేజ్ అదరగొట్టాడు. ఒక మాస్ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాఅలు వరుణ్ లో కనబడ్డాయి. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమా మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్ గురించే. ఎందుకంటే మిక్కీ జె మేయర్ మొదటిసారిగా ఒక మాస్ సినిమాకి సంగీతం అందించాడు. పాటలు వింటుంటే మిక్కీ జే మేయరే సంగీతం అందించాడా అని అనుకుంటాం. ఈ సినిమా విజయం దర్శకుడు ముందే ఊహించినట్టున్నారు. అందుకే సూపర్ హిట్టు, బొమ్మ హిట్టూ అని ముందే పాట పెట్టుకున్నారు. మరి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సాధిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: