తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్- ఏఎన్నార్ రెండు కళ్ళ లాంటి వారన్న విషయం ఎంతటి వారైనా ఒప్పుకొని తీరాల్సిందే. మద్రాస్ పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడడానికి ఈ ఇద్దరు లెజెండ్స్ చేసిన కృషి అంత సులభంగా ఎవరు మర్చిపోకూడని విషయం. అప్పట్లోనే హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ని నిర్మిస్తే.. ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ ని మన తెలుగు చిత్ర పరిశ్రమకు అంకితమిచ్చారు. సినిమా స్టూడియోల నిర్మాణం వల్ల కమర్షియల్ గా లాభపడేదేమీ ఉండదని తెలిసి కూడా ఈ మహానుభావులు ఇద్దరు సినిమా అనే కళను బతికించేందుకు ఈ రెండు స్టూడియోలను నిర్మించారు. కళారంగానికి ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ లతో పాటు మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు-దర్శక రత్న దాసరి నారాయణ రావు వంటి వారి కృషిని అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటే అతిశయోక్తి కాదు.

హైదరాబాద్ లో నిర్మించిన స్టూడియోల వల్లనే సినిమాల నిర్మాణం పెరిగి.. ఉపాధి పెరిగి మద్రాస్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ ని హైదరాబాద్ కు తీసుకురాగలిగారు. ఎన్టీఆర్ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక ఏఎన్నార్ రాజకీయాలవైపు మొగ్గు చూపకుండా ..ఆయన చివరి శ్వాస వరకు సినిమాలే లోకంగా జీవించారు. ఏఎన్నార్ బయోపిక్ తీస్తారని వార్తలు వచ్చినా వాటిని గతంలో అక్కినేని నాగార్జున ఖండించారు. ఏఎన్నార్ నటించిన ఏ సినిమాను రీమేక్ చేసే ఆలోచన లేదని, బయోపిక్ చేసే సాహసం చేయలేమని నాగార్జున నిర్మొహమాటంగా చెప్పేశారు.

సెప్టెంబర్ 20 న ఏఎన్నార్ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో సంస్మరణం చేసుకున్నారు.  అన్నపూర్ణ స్టూడియోస్ ట్విట్టర్ ప్రధాన ఇమేజ్ ఏఎన్నార్ సినిమాల పోస్టర్లతో కళకళలాడుతోంది. ఫేస్ బుక్ లో అభిమానులతో.. పలువురు ప్రముఖులతో ఏఎన్నార్ వీడియో ఆకర్షిస్తోంది. క్లాసిక్ డేస్ రారాజుగా ఆయన అభిమానుల హృదయాల్లో నిలిచి ఉన్నారు. వాస్తవంగా సినీ పరిశ్రమలో ఈ రోజు కొన్ని వేల మంది బ్రతుకుతున్నారంటే ఎన్టీఆర్- ఏఎన్నార్ చలువేనని చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: