మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా టైటిల్ వివాదం గురించి తెలిసిందే. సినిమా రిలీజ్ ఆగిపోయే పరిస్థితులు రావడంతో టైటిల్ మార్చారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. మెగా హీరోల సినిమాల విషయంలోనే ఇలాంటి వివాదాలు ఎక్కువగా జరగడం యాధృచ్చికం.

 

 

రామ్ చరణ్ నటించిన మగధీరలో.. సెకండాఫ్ లో వచ్చే పాటలో “ఏం పిల్లడో ఎళ్ద మొస్తవా..” అనే వాక్యం తీసేయాలంటూ పట్టుబట్టారు. పవన్ కల్యాణ్ నటించిన కొమరం పులి సినిమా విషయంలోనూ టైటిల్ పై పెద్ద వివాదమే జరిగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విడుదలైన ఈ సినిమా టైటిల్ లో కొమరం తీసేయాలంటూ విద్యార్ధి సంఘాలు, తెలంగాణ వాదులు పట్టుబట్టారు. మొత్తానికి పులి టైటిల్ తోనే సినిమా విడుదలైంది. గతేడాది పవన్ అజ్ఞాతవాసి సినిమాలో ‘కోటేశ్వరరావు..’ అనే పాట ఉంది. ఆపేరుతో ఉన్న ఓ వ్యక్తి ‘కోటేశ్వరరావు’ పేరు తీసేయాలని కోర్టు నోటీసులిచ్చాడు. రామ్ చరణ్ రంగస్థలంలో “రంగమ్మా.. మంగమ్మా..” పాటలోని చరణంలో ‘గొల్లభామ’ అనే పదం ఉంది. పాటలో ఈ పదం తీసేయాలంటూ ఓ వర్గం పట్టుబట్టడంతో గొల్లభామను ‘గోరువంక’గా మార్చారు. ఇప్పుడు వాల్మీకి టైటిల్ పై కూడా పెద్ద వివాదమే జరిగింది. రేపు విడుదలనగా ముందురోజు రాత్రి టైటిల్ ను గద్దలకొండ గణేశ్ గా మార్చారు. చిరంజీవి సైరా.. విషయంలోనూ ఉయ్యాలవాడ కుటుంబీకులు – నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదం కూడా తెలిసిందే. రిలీజ్ దగ్గరపడుతూండటం.. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కిరాకపోవటం గమనించాల్సిన విషయం.

 


ఇవన్నీ మెగా హీరోల సినిమాల విషయంలో జరిగినవే. సినిమా పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఆయా వర్గాలు నుంచి ఎదురైన ప్రతిఘటనలకు మార్పులు చేశారు. కానీ.. ఇన్ని వివాదాలూ మెగా హీరోల సినిమాలకు జరగడమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: