తెలుగు సినీ పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. నారమల్లి శివప్రసాద్.. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు. నాటక రంగం నుంచి సినీ పరిశ్రమకు వచ్చిన ఆయన తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కమెడియన్ గా, క్యారెక్టర్ నటుడిగా, విలన్ గా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో రాణించారు. ప్రముఖ సినీ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది శివ ప్రసాద్ కావడం గమనార్హం.

 


సినిమాపై ఆయనకున్న ప్రేమ అపారమైనది. వచ్చిన ప్రతి పాత్రను అవలీలగా చేసేవారు. నటుడిగా రాణించిన ఆయన నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా చేశారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొకొరొక్కో వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో భాగంగా నటి రోజాను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. “బేసిగ్గా నేను సినీ ఆర్టిస్ట్ కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోయేవాడిని. ఏడాదికి రెండు సినిమాలు డైరెక్ట్‌ చెయ్యాలని డిసైడ్‌ అయ్యాను. 1991లో 'ప్రేమతపస్సు' సినిమా స్టార్ట్‌ చేశాం. ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని ఆరు నెలల పాటు తిరిగాం. ఫైనల్‌గా శ్రీలత అనే అమ్మాయిని “రోజా”గా పేరు మార్చి ఆ చిత్రంతో ఇంట్రడ్యూస్‌ చేశాం. రోజాకి పర్ఫెక్ట్ ట్రైనింగ్‌ ఇచ్చి నటనలో మెళుకువలు నేర్పించాం. నిర్మాత పోకూరి బాబూరావుని విలన్‌గా కూడా పరిచయం చేశాను” చెప్పుకొచ్చారు.

 


ఆయన మరణంతో సినీ పరిశ్రమ ఓ మంచి నటుడిని కోల్పోయింది. ఇటివలి వరకూ కూడా ఆయన పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. చిరంజీవి ఖైదీ సినిమాలో సుత్తివేలుతో కలిసి బిచ్చగాడి పాత్రలో నటించి మెప్పించారు శివ ప్రసాద్.


మరింత సమాచారం తెలుసుకోండి: