ఈ వారం విడుదలైన గద్దలకొండ గణేష్ ( వాల్మీకి ) కు మాస్ ప్రేక్షకుల నుంచే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తోంది. మెగా ఫాన్స్ అంచనాలకు తగ్గట్టే దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో మాంచి మసాలాలను దట్టించిన విధానం అందరిని బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ తేజ్ రిస్క్ చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇప్పటిదాకా కాదు ఇకపై కూడా కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని అభిమానుల తో పాటు ఇండస్ట్రీ వర్గాలు అంటున్న మాట. ఇక ఈ సినిమాలో అన్ని సరిగ్గానే కుదిరాయి కాని తమిళ నటుడు అధర్వ మురళి పాత్ర గురించి మాత్రం చాలామంది  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అందుకు ప్రత్యక్షంగా కనిపించే కారణాలు ఉన్నాయి కూడా. అధర్వ మనకు ఏ మాత్రం పరిచయం లేని నటుడు. ఇంతకు ముందు ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా వచ్చింది.  కానీ ఆ సినిమాని ఎవ్వరు అంతగా పట్టించుకోలేదు. అలాంటప్పుడు ఇంత కీలకమైన పాత్రకు అతన్ని తీసుకోవడం సినిమాకు కొంత మైనస్ గానే నిలిచింది. సాధారణ ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతున్నారు . ఒకవేళ ఎవరైనా తెలుగు హీరోనో లేదా ఫామ్ లో లేని తెలిసిన మోహాన్నో తీసుకుని ఉంటే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ దక్కేది. అంతేకాదు ఈ క్యారెక్టర్ కి మన దగ్గర సరిగ్గా సూటయ్యో వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకు మంచు మనోజ్ ని గనక తీసుకొని ఉంటే ఒక మల్టీ స్టారర్ అయి ఉండేది. అలా కాకుండా సందీప్ కిషన్, ఆది పినిశెట్టి, అల్లరి నరేష్, రవి వర్మ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.

అన్ని విషయాల్లోనూ జాగ్రత్త తీసుకున్న హరీష్ శంకర్ ఈ సెలక్షన్ లో మాత్రం రాజీ పడినట్టుగా కనిపిస్తోంది. దానికి తోడు విలన్ పాత్రలకు బాగా మ్యాచ్ అయ్యే హేమచంద్ర గొంతుతో అధర్వకు డబ్బింగ్  చెప్పించడం చాలా సీన్స్ లో సెట్ అవలేదు. ఈ లోపాలన్నీ వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ తో హరీష్ శంకర్ కామెడీ టైమింగ్ తో కవరైపోయాయి కానీ.. లేదంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో. ఏదేమైనా ఈ చిన్న మైనస్ ను పక్కన పెడితే మిగతా అంతా సూపర్ గా డీల్ చేశాడు హరీష్ శంకర్. 



మరింత సమాచారం తెలుసుకోండి: