చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై నేటికి 41 ఏళ్లు పూర్తయ్యాయి. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ఆ సినిమాతో తెలుగు సినిమాల్లో ఆయన వేసుకున్న పునాదిరాళ్లు ఎప్పటికీ చెక్కుచెదరనివి. నటనపై మక్కువతో కొణిదెల శివశంకర వర ప్రసాద్ గా తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి ‘చిరంజీవి’గా మారిపోయాడు. సినిమాల్లో ఇంతై, ఇంతింతై.. అన్నట్టుగా ఎదిగిపోయి నటుడిగా, సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా అశేష ప్రక్షకాభిమానుల గుండెల్లో ఖైదీ అయిపోయాడు.

 


వారమంతా కష్టపడి కాస్తంత రిలాక్సేషన్ కోసం చిరంజీవి సినిమాకే వెళ్లేవారు ప్రేక్షకులు. ఫైట్స్ లో ఒరిజినాలిటీ, డ్యాన్సుల్లో ఆయన చూపే వైవిధ్యం.. చిరంజీవిని తెలుగు సినిమాల్లో శిఖరాగ్రాన కూర్చోబెట్టాయి. ఎనభై-తొంబైల్లో రాష్ట్రంలోని ఏ ఊళ్లో అయినా ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా.. నువ్వు పెద్ద చిరంజీవివి మరి ’ అంటూ చమత్కారాల్లా అందరి నోళ్లలో నాని పోయారు. మాస్ మంత్రంతో యువతను, కామెడీతో చిన్న పిల్లలను, నటనతో కుటుంబ ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకూ ఎంటర్ టైన్ చేసే సమ్మోహన శక్తిగా చిరంజీవి పేరు గడించారు. మాస్ పాత్రల్లో నూతన ఒరవడి సృష్టించారు. కామెడీ టైమింగ్ లో చిరంజీవిదే అగ్ర తాంబూలం. ఎందరో దర్శకులు, నిర్మాతలు, నటులు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలనే స్థాయికి ఎదిగిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ హీరో.

 


చిరంజీవి సినిమాలు చూసి మురిసిపోయిన ఎందరో చిన్నారులు ఈరోజు ఆయనకు మెగా అభిమానులుగా మారిపోయారు. అభిమానులకు ఆయన ‘అన్నయ్య’. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా అక్టోబర్ 2న విడుదల కానుంది. సినిమాల్లో 42వ ఏట అడుగుపెడుతున్న చిరంజీవి మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకాభిమానులను అలరించాలని కోరుకుందాం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: