‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆవేశంగా చేసిన ఉపన్యాసంలో తన అన్నా వదినల పై ప్రశంసలతో పాటు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయం కూడ చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఉద్వేగంగా మాట్లాడుతూ దేశ భక్తి గురించి ఉయ్యాలవాడ గొప్పతనం గురించి తన అన్న చిరంజీవి ప్రతిభ గురించి ఎన్నో ఆసక్తికర ప్రశంసలను కురిపించాడు.

ఈ మాటల మధ్య తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల ప్రస్తావన వచ్చింది. తాను ఇంటర్ లో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని భావించినప్పుడు తన అన్న చిరంజీవి జీవితం అంటే ఒక్క పరీక్షలు మాత్రమే కొలమానం కాదు అంటూ తనకు ధైర్యం చెప్పిన విషయాన్ని మరొకసారి గుర్తుకు చేసుకున్నాడు. 

చిరంజీవి లాంటి అన్నయ్యలు ప్రతి కుటుంబంలోనూ ఉంటే ఇలా విద్యార్ధుల ఆత్మహత్యలు ఉండేవి కావు అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. పవన్ నోటివెంట ఈమాటలు యధాలాపంగా వచ్చినవే అయినా ఈ మధ్య గత కొంత కాలంగా పవన్ తెలంగాణా ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న నేపధ్యంలో పవన్ నోటివెంట ఈ మాటలు రావడంవెనుక రాజకీయ కోణం ఉందా అని అందరికీ అనిపించింది. 

ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ ప్రపంచంలోని ఎన్నో దేశాలు భారత్ పై దాడి చేసి దోచుకున్నాయి కాని భారత దేశం ఏ దేశం పైనా దాడి చేసిన సందర్భాలు లేవు అంటూ భారత దేశ చరిత్ర గొప్పతనాన్ని వివరించాడు. గాంధీ జయంతి రోజున ఈ సినిమా విడుదల కావడం ఆనందింప తగ్గ విషయం అంటూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మహాత్మా గాంధీ సర్దార్ వల్లబాయ్ పటేల్ అంబేడ్కర్ జీవిత చరిత్రలకు సమానంగా స్ఫూర్తి దాయకం అంటూ ఉయ్యాలవాడ పై ప్రశంసలు కురిపించాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: