టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూశారు. వేణుమాధ‌వ్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. వేణుమాధ‌వ్ స్వ‌స్థ‌లం తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండ‌లం. 1979లో తెలంగాణ‌లోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.


కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేప‌ల్లి చంద‌ర్‌రావు, పారా లింగ‌య్య ఇచ్చిన ప్రోత్సాహంతో వేణు మిమిక్రీ రంగంలో దూసుకుపోయాడు. చివ‌ర‌కు మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి సినిమా క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చారు.  1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన సంప్రదాయం సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇక
గ‌త కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం మృతిచెందారు.


వేణుమాధ‌వ్ ముందుగా లివ‌ర్ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డే వారు. కొద్ది రోజులుగా ఆయ‌న కిడ్నీల వ్యాధికి కూడా గుర‌య్యారు. కిడ్నీలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో డ‌యాల‌సిస్ కూడా చేయించుకుంటున్న‌ట్టు స‌మాచారం. చివ‌ర‌కు రెండు రోజులుగా కోమాలోకి వెళ్లిపోయిన ఆయ‌నకు వైద్యం అందించేందుకు వైద్యులు చేసిన విఫ‌ల ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ప‌రిస్థితి బాగా విష‌మించ‌డంతో ఈనెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు.  


ఇక వేణుమాధ‌వ్ మృతికి ప్ర‌ధాన కార‌ణం లివ‌ర్‌, కిడ్నీలు పాడ‌వ్వ‌డమే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఆరోగ్య ప‌రంగా నాలుగు సంవ‌త్స‌రాల నుంచే ఇబ్బందులు ప‌డుతోన్న ఆయ‌న చివ‌ర‌కు సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఒక‌టీ అరా ఛాన్సులు వ‌చ్చినా కూడా చేయ‌లేదు. ఆయ‌న నిన్న‌టి నుంచే చ‌నిపోయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మధ‍్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు. ఏదేమైనా త‌న పాత్ర‌ల‌తో తెలుగు ప్ర‌జ‌ల‌ను న‌వ్వించిన వేణుమాధ‌వ్ లేని లోటు ఎవ్వ‌రూ తీర్చ‌లేనిది.



మరింత సమాచారం తెలుసుకోండి: