తెలుగు సినిమాల్లో ఉన్నంత కమెడియన్ల సంఖ్య దేశంలోని మరే సినీ పరిశ్రమలో ఉండరనేది నిజం. ఎందరో కమెడియన్లు తమ టాలెంట్ తో సత్తా చాటారు. వారిలో తానూ ఒకడిగా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టయిల్ తో దాదాపు ఇరవైయ్యేళ్లు తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వించాడు వేణు మాధవ్. అటువంటి నటుడు చిన్న వయసుకే 'సినీ'లోకాన్ని వీడటం బాధాకరం. 600 పైగా సినిమాల్లో నటించిన వేణుమాధవ్ మిమిక్రీ చేయటంలో దిట్ట.


ఎంతో ఫోర్స్ తో స్టైలిష్ కామెడీ చేయడంలో వేణుమాధవ్ తీరు ప్రత్యేకం. ముఖ్యంగా రజనీకాంత్ స్టయిల్లో సిగరెట్ నోట్లో వేస్తూ.. చేతులు  తిప్పుతూ చేసే కామెడీలో తనకు తానే సాటి. శంకర్ దాదా ఎంబీబీఎస్, ఛత్రపతి, లక్ష్మీ, బంగారం.. మొదలైన సినిమాల్లో ఆయన కామెడీ అమోఘం. హంగామా, భూకైలాస్ సినిమాల్లో హీరోగా, అన్నవరం సినిమాలో సెంటిమెంట్ పాత్రలో నటించి మెప్పించాడు. సినీ పరిశ్రమలో ఆజాతశత్రువు గా అందరితో సత్సంబంధాలు కొనసాగించాడు వేణుమాధవ్. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో ఓ దశలో దర్శకుడు శివ నాగేశ్వరరావుకు కనిపించిన ప్రతిసారీ తన ఐడెంటిటీ కార్డ్ ఇచ్చేవాడట. అలా ఇచ్చిన కార్డుల సంఖ్య 113కు చేరుకున్నా అవకాశం ఇవ్వకపోవటంతో అవి తీరిగిచ్చేస్తే వేరే ప్రయత్నాలు చెసుకుంటా అన్నాడట. అదే శివ నాగేశ్వరరావు తర్వాత రోజుల్లో వేణుమాధవ్ హీరోగా భూకైలాస్ తీశారు.


తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్లకు లోటు లేకపోయినా కొందరి మరణాలతో వారు లేని లోటు మాత్రం పూడ్చలేనిది. ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, కొండవలస.. మృతినే జీర్ణించుకోలేని సినీ పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులకు వేణుమాధవ్ మృతి బాధాకరమైన విషయమే. వీరితోపాటు వేణుమాధవ్ కామెడీని కూడా మిస్ అయిపోయారు. అనారోగ్యంతో వేణుమాధవ్ కొన్నాళ్ల నుంచి సినిమాలు తగ్గించుకున్నాడు. హాస్యానికి పెద్దపీట వేసే తెలుగు సినిమాల్లో వీరందరూ లేకపోవటం విచారకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: