నవ్వు అన్నది మనిషి జీవితంలో ఎంతో ప్రధానం. ఒక్కసారిగా డెబ్బయి రెండు కండరాలు రీచార్జి చేస్తుంది. నవ్వు కంటే దివ్య ఔషధం లేదంటారు. ఈ పాపిష్టి లోకంలో ఏడిపించేవారే కానీ నవ్వులు పంచేవారు లేరంటారు. అటువంటిది తమ నటనా వైదుష్యంతో నవ్వులు పూయించి మనలను హెల్తీగా ఉంచే హాస్య‌నటుల రుణం తీర్చుకోలేనిదే. తెలుగు పరిశ్రమకు హాస్యం విషయంలో గొప్ప పేరు ఉంది.


అదేంటి అంటే ఇక్కడ ఉన్నంతమంది హాస్యనటులు ఎక్కడా లేరని పేరు. దాదాపుగా పాతికకు పై చిలుకు హాస్యనటులతో అలరారే పరిశ్రమ టాలీవుడ్. కానీ విషాదం ఏంటంటే హాస్య‌నటులు అంతా బాధలతో, అనారోగ్యాలతో చిన్న వయసులో కన్నుమూయడమే. తెలుగు సినిమా రంగంలో తమకంటూ ముద్ర వేసుకున్న బట్టల సత్యం కూడా అనూహ్యంగా ఈ లోకాన్ని వీడిపోయారు.


అలాగే ధర్మవరపు సుబ్రమణ్యం తన ఆరోగ్యకరమైన హాస్యంతో అలరించేవారు. ఆయన సైతం బాధను అనుభవిస్తూనే ఈ లోకాన్ని విడిచారు. ఇక ఏవీఎస్ సైతం మంచి ప్రతిభావంతుడు. ఆయన కూడా మరిన్నాళ్ళు ఉండాల్సిన వేళ హఠాత్తుగా కనుమరుగు అయ్యారు. అదే విధంగా ఎం ఎస్ నారాయణ సైతం అదే తీరున అందరినీ కంటతడి పెట్టించి వెళ్ళిపోయారు. అదే విధంగా అర గుండు గా పేరు తెచ్చుకున్న హనుమంతరావు సైతం కొన్నాళ్ళ క్రితమే ఈ ప్రపంచాన్ని వీడిపోయారు.



హాస్యాన్ని స్రుష్టించి తెలుగు జాతికి అందించిన ప్రముఖ దర్శకుడు జంధ్యాల సైతం నిండా యాభైఏళ్ళు రాకుండానే కన్నుమూశారు. ఆయన శిష్యుడిగా ఉంటూ కామెడీకి పెట్టింది పేరుగా ఉన్న ఇవీవీ సత్యనారాయణ సైతం అనూహ్యంగా అందరినీ వీడిపోయారు. ఇపుడు చూస్తే వేణుమాధవ్ తెలుగువారికి కంటతడి పెట్టించి వెళ్ళిపోయారు. వెణుమాధవ్ లాంటి నటుడుకి ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంకా పదికాలాలు ఉంటూ ఎన్నో పాత్రలకు ప్రతిష్ట చేయాల్సిన వేళ ఇలా రోగాల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలించడం బాధాకరం. నవ్వు వెనక విషాదాలు అంటే ఇదేనేమో. ఈ శాపం ఇకపైన టాలీవుడ్ కి తగలరాదని హాస్యప్రియులు అంతా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: