తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం. ప్రముఖ హాస్య నటుడు,మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ కన్నుమూశారు.  గత కొంత కాలంగా లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.  ఈ నెల 6న సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. అయితే గతంలో కూడా ఆయన చనిపోయినట్లు పలుసార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా మీడియా కథనాలపై వేణు మాధవ్ మండిపడ్డారు.

నేను బతికి ఉంటే.. చనిపోయానంటూ వార్తలు రాస్తారా అంటూ పలు టీవీ ఛానల్స్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. దీంతో ఆయన నిజంగానే మరణించారా లేదా ఇది కూడా ఫేక్ న్యూస్ అని చాల మంది అనుమానించారు. కానీ ఈ రోజు 12.21 నిమిస్తాలకు మరణించినట్టు డాక్టర్లు అధికారికంగా ప్రకటించడంతో అయన అభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన వేణుమాధవ్ పవన్ కళ్యాణ్‌ సినిమా తొలిప్రేమతో టాలీవుడ్‌లో స్టార్ రేంజ్‌కు తీసుకెళ్ళింది.తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో మిమిక్రీ  షో చేయగా అది దివంగత ఎన్టీఆర్ ను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత కొంత కాలంపాటు టీడీపీ కార్యాలయంలో కూడా వేణుమాధవ్ పని చేశారు. ఆ తర్వాత సినీరంగంలో ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన  'సంప్రదాయం' చిత్రంతో వెండితెరకు పరిచయయ్యారు.అంతకముందు అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన వేణుమాధవ్... తొలిప్రేమ సినిమాలో చేసిన కామెడీ ఆయన కెరీర్‌ను కీలకమైన మలుపు తిప్పింది.

వేణు పోషించిన ఆర్నాల్డ్ క్యారెక్టర్... అమ్మాయిల గురించి ఆయన చెప్పే లెంగ్తీ డైలాగ్‌ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. 600లకు పైగా సినిమాల్లో నటించిన వేణు మాధవ్ టాలీవుడ్ లో ఆలీ, బ్రహ్మానందం తరువాత కమెడియన్ గా తనదైన ముద్ర వేశారు.   అంతే కాకుండా అయన కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. వేణుమాధవ్ మరణవార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. వేణుమాధవ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: