ప్రభాస్, శ్రధ్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు 350 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
 
సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా మొదటి నాలుగు రోజులు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్ లో సాహో సినిమా థియేట్రికల్ రైట్స్ 70 కోట్ల రూపాయలకు అమ్మగా 150 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు 125 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ సినిమాకు నాలుగు వారాల్లో 85 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 40 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. కర్ణాటకలో సాహో సినిమా 17 కోట్ల రూపాయలు వసూలు చేయగా, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, మలయాళంలో కోటి 50 లక్షల రూపాయలు షేర్ కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో సాహో సినిమా భారీ నష్టాలనే మిగిల్చింది. ఓవర్సీస్ లో ఈ సినిమాకు 14 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. 
 
హిందీని మినహాయిస్తే మిగతా భాషల్లో సాహో సినిమాకు 60 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. సాహో సినిమాకు నష్టాలు వచ్చినా ప్రభాస్ కు బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా మార్కెట్ పెరగటం విశేషం. ప్రభాస్ సినిమాలకు హిట్ టాక్ వస్తే చాలు బాలీవుడ్ లో 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సులభంగా వచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ తరువాత సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: