టాలీవుడ్ లో 'సాహో' తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా 'సైరా'. బడ్జెట్ విషయంలోనే కాకుండా ఇతర భాషలకు చెందిన వారు చాలామంది నటించడం.. పలు భాషల్లో ఒకేసారి ప్యాన్ ఇండియన్ ఫిలిం అంటూ రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఇదే ఆసక్తి ఇతర భాషలలో లేదనిపిస్తోంది.
ముఖ్యంగా హిందీ వెర్షన్ లో ప్రమోషన్స్ అల్మోస్ట్ జీరో అని అర్థమవుతుంది. తెలుగు సినిమాల ప్రమోషన్స్ కు హిందీ సినిమాల ప్రమోషన్స్ కు చాలా తేడా ఉంటుంది. ఎంత పెద్ద బాలీవుడ్ స్టార్ అయినా తమ సినిమాలకు కనీసం పది-పదహేను రోజుల పాటు భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు.. టీవీ రియాలిటీ షోలు.. బిగ్ బాస్ లు.. నచ్ బలియేలు.. కపిల్ శర్మ షో.. ఇలా ఉన్న అన్ని షోలకు హాజరై తమ సినిమాను ప్రచారం చేసుకుంటారు. 'సాహో' విషయంలో ప్రభాస్ ఏ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్నాడో అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ముంబైలోనే కొన్ని రోజులు మకాం వేసి అక్కడ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇక అన్నీ రియాలిటీ షోలలోను పాల్గొని సాహోను ఒక రేంజ్ లో ప్రమోట్ చేశాడు. దీంతో సినిమాకు భారీగా క్రేజ్ వచ్చింది. ఆల్రెడి ప్రభాస్ కు 'బాహుబలి' స్టార్ అనే క్రేజ్ ఉన్నా కూడా తనే స్వయంగా భారీ స్థాయిలో సాహో కి ప్రమోషన్స్ చేయడం హిందీ వెర్షన్ కు ప్లస్ గా మారింది.  అయితే 'సైరా'  విషయంలో అలాంటి హడావుడి ఏదీ కనిపించడం లేదని మెగా ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారట.
ఇప్పటివరకూ 'సైరా' హిందీ వెర్షన్ ప్రమోషన్స్ లో సందడే లేదు. మెగాస్టార్ చిరంజీవి హిందీ ప్రేక్షకులకు తెలిసిన పేరే కానీ ప్రభాస్ లా క్రేజ్ అయితే లేదన్న మాట ఒప్పుకొని తీరాలి. కాబట్టి హిందీ ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంది అనే టాక్ వస్తే తప్ప పట్టించుకునే పరిస్థితి బాలీవుడ్ లో కాస్తైనా కనిపించడం లేదు. అంతేకాదు ఇప్పుడు ప్రమోషన్స్ కూడా లేవు కాబట్టి ఓపెనింగ్స్ పై ఇది ప్రభావం చూపించే అవకాశం గట్టిగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే నిజమైతే మాత్రం 'సాహో' కలెక్షన్స్ ను క్రాస్ చేయడం 'సైరా' కు సవాలే. 



మరింత సమాచారం తెలుసుకోండి: