హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది కానీ.. ఆ హీరో సినిమా ఫ్లాప్ అవ్వాలని మరో హీరో కోరుకోడు. ఎందుకంటే ఆ సినిమా మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి. ఇలాంటి ఉదంతంపై తనకూ పవన్ కల్యాణ్ కు మధ్య జరిగిన ఈ విషయాన్ని ఇటివల ఓ ఇంటర్వూలో చెప్పాడు దర్శకుడు హరీశ్ శంకర్.

 


2012లో తాము స్విట్జర్లాండ్ లో గబ్బర్ సింగ్ సినిమాలో పిల్లా నువ్వు లేని జీవితం..పాట షూటింగ్ లో ఉన్నప్పుడు తెలుగులో ఎన్టీఆర్ నటించిన దమ్ము రిలీజయింది. అసలే పెద్ద హీరో సినిమా.. స్వతహాగా తాను దర్శకుడు కావడం వల్ల ఆ సినిమా రిజల్ట్ గురించి ఆరా తీశాడట హరీశ్. కానీ ఆ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిందని తెలుసుకున్నాడట. అదే విషయాన్ని పాట చిత్రీకరణ సమయంలో పవన్ వద్ద ప్రస్తావించాడట హరీశ్. కానీ పవన్ నుంచి ఏమాత్రం స్పందన, హావభావాలు రాకపోగా.. ఈ పాట షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది.. మనమెప్పుడు వెళ్తున్నాం..అని అన్నాడట. దీని గురించి హరీశ్ చెప్తూ.. తన పని తాను చేసుకోవడం తప్ప ఇతరుల పనిని తక్కువ చేసి చూడని ఉన్నత వ్యక్తిత్వం పవన్ సొంతమని చెప్పుకొచ్చాడు.

 

 

ఇదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం అల్లు అర్జున్ కూడా చెప్పాడు. తాను ఓ హీరో సినిమా ఫ్లాప్ అయిందని చెప్తే.. తప్పు.. వాళ్ల సినిమా గురించి అలా మాట్లాడకూడదు. ఆ సినిమా హిట్ అయితే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి. ఫ్లాప్ అయితే వాళ్లు నష్టపోతారు. ఒకరి బాగు మాత్రమే మనం కోరుకోవాలి అని పవన్ తనతో అన్నట్టు స్వయానా అల్లు అర్జున్ చెప్పాడు. ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో పవన్ కల్యాణ్ మనస్తత్వం, సహృదయత మరోసారి స్పష్టమయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: