చిన్న నటుడి నుంచి మెగాస్టార్     స్థాయికి  ఎదిగిన మేరు నగధీరుడు చిరంజీవి. ఇక ఆయన వచ్చిన టైంలోనే తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారు కొత్త రకం నటనతో అక్కడ పాగా వేశారు. ఈ ముగ్గురు నటులూ దశాబ్దాల పాటు తమదైన స్టార్ డం తో సినీ పరిశ్రమను వుర్రూతలూగిస్తున్నారు. ఇప్పటికీ నాటౌట్ అంటున్నారు. అటువంటి ఈ నటుల మధ్య మంచి స్నేహం కూడా ఉంది.


ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన సాటి హీరోలకు మంచి సలహా ఇచ్చారు. నటనకు సంబంధించి మాత్రం అది కాదు. రాజకీయాల్లో మాత్రం చిరంజీవి వారి కంటే సీనియర్ కాబట్టి విలువైన సూచనలే చేసారు. రాజకీయాల్లోకి దయచేసి రావద్దు మిత్రులారా అంటూ చిరంజీవి ఇచ్చిన ఆ సలహా మాత్రం చాలా గొప్పది, ఆలోచింపచేసేదిగా భావించాలి.


ఓ పత్రికకు చిరంజీవి తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. రాజకీయాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చిరంజీవి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నంబర్ వన్ స్టార్ గా ఉంటూ తాను రాజకీయాల్లోకి వెళ్తే తన సొంత నియోజకవర్గంలో ఓడించారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో తన తమ్ముడు పవన్ని కూడా ఓడించారని ఆయన అన్నారు.


రాజకీయాల్లో కులం, డబ్బు రాజ్యం చేస్తున్నాయని, ఫలితాలను అవే శాసిస్తున్నాయని చిరంజీవి అన్నారు. అందుకే రాజకీయాల్లోకి రావడం అంటే సినిమా తారలు ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లో ఓడిపోయినా కూడా కొనసాగగలం అనుకుంటే మాత్రం రావడం మంచిదని కూడా చిరంజీవి అనడం విశేషం. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా చిరంజీవి రాజకీయాల పట్ల తన వ్యతిరేకతను మరో మారు చాటుకున్నారని అంటున్నారు.


.


మరింత సమాచారం తెలుసుకోండి: