అవకాశాలు లేనివాళ్లు కొందరుంటారు. అవకాశాలు ఉండి కూడా ఏ ఉపయోగం లేనివాళ్లు కొందరుంటారు. ఈ రెండో రకం హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. అవకాశాలు అడుగంటిపోవు వీరికి. ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంటారు. కానీ అవి వారికి ఎందుకూ ఉపయోగపడవు. ఉదాహరణకు శ్రీకాంత్ ని తీసుకోండి. అతి తక్కువ సమయంలో, చిన్న వయసులోనే వంద సినిమాలను పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ చిత్రాలు కొన్నే అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. గత కొంతకాలంగా ఇతడి కెరీర్ డల్ అయ్యింది. అలాగని అవకాశాలు లేవనలేం. ఎందుకంటే, ఎప్పుడూ చేతినిండా చిన్న సినిమాలతో బిజీగానే ఉంటాడు. కానీ వాటిలో ఏదీ అతడికి ఉపయోగపడదన్న విషయం మనకి తెలుసు, అతడికీ తెలుసు. అయినా చేస్తుంటాడంతే. ప్రస్తుతం టేకెన్ అనే ఇంగ్లిష్ చిత్రానికి రీమేక్ గా వస్తోన్న హంటర్ తో పాటు, మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు. శివాజీ కూడా అదే టైపు. అతడు కూడా ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. కానీ వాటిని ఎవరైనా చూస్తున్నారా లేదా అన్నది మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. వరుణ్ సందేశ్ పరిస్థితి కూడా అదే. చాన్సులు వస్తున్నాయి. కానీ హిట్టయ్యే చాన్స్ మాత్రం లేదు. ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాడు. జనాలు చూడలేరు కాబట్టి చూడటం లేదు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతడే ఆకాశ్. ఇతడున్నంత బిజీగా మరే చిన్న హీరో ఉండడు. ప్రతి సినిమా ఓ ప్రయోగం. ఏదో చెప్పాలనుకుంటాడు. కానీ వినడానికి జనమే సిద్ధంగా ఉండరు. ఇంకా ఇలాంటివాళ్లు బొచ్చెడుమంది ఉన్నారు. వీరందరూ టాలెంట్ లేనివాళ్లేం కాదు. లక్ లేనివాళ్లంతే. నిజానికి వాళ్ల పరిస్థితి ఏమిటో వాళ్లకీ తెలుసు. మార్కెట్ లేదని, డిమాండ్ పడిపోయిందని తెలుసు. అయినా కూడా ఎందుకిలాంటి ప్రయోగాలు చేస్తారు, ప్రేక్షకులని వేటాడేస్తారు అన్నది మాత్రం అర్థం కావడం లేదు. వీళ్లందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే. హీరో మాత్రమే బతకడు ఇండస్ర్టీలో. విలన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బతుకుతున్నారు. వాళ్లూ పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి కాస్త రూటు మార్చి అలాంటివేమైనా ట్రై చేస్తే వాళ్ల టైమూ మిగులుతుంది. నిర్మాతల సొమ్మూ క్షేమంగా ఉంటుంది. కాబట్టి చిన్న హీరోలూ... ఇక వేట ఆపేయండి ప్లీజ్!

మరింత సమాచారం తెలుసుకోండి: