కొందరు మంచి కథలతో సినిమాలు తీసి హిట్ కొట్టి పెద్ద నిర్మాతలుగా ఎదుగుతారు. మరికొందరు డైరక్టర్ల మీద నమ్మకంతోనో, హీరో మీద నమ్మకంతోనో భారీ పెట్టుబడులు పెడతారు. ఫలితం తలకిందులైతే మాత్రం భారీ నష్టాలు చవిచూసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం తమిళంలో పెద్ద సినిమాలు నిర్మించే ఓ నిర్మాణ సంస్థ పరస్థితి ఇలానే ఉందని కోలివుడ్ టాక్.

 


తమిళంలో పలు భారీ చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ అధినేత రజనీకాంత్, విజయ్, సూర్య, శింబు.. వంటి అగ్రహీరోలతో సినిమాలు తీశాడు. వీటిలో పలు హిట్ సినిమాలు కూడా ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న సూపర్ స్టార్, వెర్సటైల్ హీరో సినిమాలు కూడా ఆ భారీ నిర్మాత నిర్మిస్తున్నవే. ఈయన గతేడాది ఓ అగ్ర దర్శకుడితో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఫెయిల్ కావడంతో బయ్యర్లు తీవ్ర నష్టాలపాలయ్యారు. కనీసం చైనా మార్కెట్ లో కూడా సినిమా నిలబడలేదు. దీంతో ఇప్పుడు సదరు నిర్మాత భారీ మొత్తంలో అప్పుల బాధను ఎదుర్కొంటున్నాడని.. ఈ సంఖ్య వంద కోట్లకు పైగానే అనేది చెన్నై సినీ వర్గాల సమాచారం. ఇటివల రాజమండ్రిలో షూటింగ్ జరుపుకున్న ఓ భారీ చిత్రం విషయంలో ఆ అగ్ర దర్శకుడికి ఈ నిర్మాత బడ్జెట్ లిమిట్స్ పెట్టాడనే వార్తలు గతంలోనే వచ్చాయి. అందుకే ఆ సినిమా షూటింగ్ కు అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయనేది టాక్.

 


గతంలో ప్రేమదేశం తీసి హిట్ కొట్టిన కుంజుమెన్ రక్షకుడు తీసి భారీగా నష్టపోయి మళ్లీ సినిమాలు తీయలేకపోయాడు. మరో భారీ నిర్మాత ఏ.ఎం.రత్నం కూడా ఇలా కాస్ట్ ఫెయిల్యూర్స్ తో వెనక్కి వెళ్లిపోయినవాడే. సినిమాలో విషయం లేకపోతే సినిమాలోని భారీతనం కలెక్షన్లు తీసుకురావని గతేడాది వచ్చిన ఓ భారీ చిత్రం నిరూపించింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: