ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ ఇటీవల అనారోగ్య కారణాల వలన మృతి చెందిన విషయం తెలిసిందే. ఎప్పటినుండో ఎంతో ఆరోగ్యంగా ఉన్న వేణుమాధవ్, ఒక్కసారిగా అనారోగ్యం బారినపడి హఠాత్తుగా మృతి చెందడం టాలీవుడ్ లోని ఎందరినో విషాదంలోకి నెట్టింది. వేణుమాధవ్ మంచి హాస్యనటుడు మాత్రమే కాక మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని, తన తోటి వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటె, అందరికంటే తానే ముందుకు వచ్చి సాయం అందిస్తుంటారని అంటున్నారు పలువురు సినిమా ప్రముఖులు. 

నిన్న వేణుమాధవ్ తో తనకున్న మంచి అనుబంధాన్ని బయట పెట్టిన నాగబాబు, వాడు లేని లోటు టాలీవుడ్ లో పూడ్చలేనిదని, వాడి ఆత్మ ఎక్కడవున్నా ప్రశాంతంగా ఉండాలని ఆయన అన్నారు. ఇకపోతే నేడు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ, కృష్ణ గారు హీరోగా, అచ్చిరెడ్డి గారు నిర్మాతగా, తాను దర్శకత్వం వహించిన సంప్రదాయం సినిమాతో వేణు టాలీవుడ్ కి కమెడియన్ గా పరిచయం అయ్యాడని, తొలి సినిమాతోనే మంచి ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అలరించిన వేణు, ఆ తరువాత తమ సినిమాల్లో చాలావరకు నటించాడని అన్నారు. అక్కడినుండి కొన్ని వందల సినిమాల్లో తన నవ్వులతో తెలుగు ప్రేక్షకులను అలరించిన వేణు, నేడు మన అందరికీ దూరంగా వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. 

నిజమైన కృతజ్ఞతకు మారు పేరు వేణుమాధవ్ అని, అతను తన ప్రక్కవారికి సాయం చేయడంతో పాటు, తొలిచిత్రంతో తనకు అవకాశం ఇచ్చిన నా పేరు, అచ్చి రెడ్డి గారి పేర్లు కలిసి వచ్చేలా తన ఇంటికి 'అచ్చి వచ్చిన కృష్ణ' అనే పేరు పెట్టుకుని మాకు ఎంతో విలువనిచ్చాడని ఆయన అన్నారు. కమెడియన్ గా కొనసాగుతూ, తన దర్శకత్వంలో హంగామా అనే సినిమాతో హీరోగా మారిన వేణు, ఆ తరువాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడని, ఆ విధంగా తమ ముందు దినదినాభివృద్ధికి చెందుతూ పైకి ఎదిగాడని అన్నారు. అటువంటి వేణు, నేడు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్లిపోవడం మా దురదృష్టం అని, ఎక్కడ ఉన్నా అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కృష్ణా రెడ్డి భావోద్వేగంతో అన్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: