తివిక్రమ్-అల్లు అర్జున్  కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి వస్తున్న సినిమా 'అల వైకుంఠపురములో'. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ సినిమాకి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఇటీవలి కాలంలో వైవిధ్యమైన పాటలు చేస్తూ,  తన మీద వున్న కాపీ ముద్ర చెరిపేసుకోవడంలో బాగానే సక్సెస్ అయ్యాడు థమన్. తొలిప్రేమ, అరవింద సమేత లాంటి మంచి అల్బమ్ లు ఇచ్చి, చేతినిండా సినిమాలతో బిజీగా వున్న థమన్ సంగీతమందిస్తున్న అల వైకుంఠపురములో ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా వాళ్ళ నుంచి హిట్ సాంగ్స్ చేయించుకునే దర్శకుడు తివిక్రమ్ గురించి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సాంప్రదాయ స్వరఝరికి, వెస్ట్రన్ టచ్ ఇస్తూ, ప్యూజన్ స్టయిల్ లో ఈ పాటను కంపోజ్ చేయడం ఆసక్తికరం. 

అయితే ఈ మిక్సింగ్ లో కూడా దేశీయ వాయిద్యాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. తన స్వరంతోనే పాటను సగం సక్సెస్ చేసే గాయకుడు సిద్దూ శ్రీరామ్ ఈ పాటను అద్భుతంగా పాడాడు. ఇక సాహిత్యానికే కేరాఫ్ అడ్రస్ అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఈ పాట రాయడం మరో గొప్ప విశేషం. కళ్లకు కాటుక కలలు కావలి కాయడం, చూపులు కాళ్లను పట్టుకుని వదలనని అనడం , వంటి మంచి భావుకత నిండిన వాక్యాలతో పాట ప్రారంభమైంది. "సామజవరగమన..నిను చూసి ఆగగలనా?" అనడం చూస్తుంటే అమ్మాయిని సామజవరగమన అని అభివర్ణించినట్లో లేదా అమ్మాయి పేరు సామజవరగమన అని పెట్టారనో అనుకోవాల్సి వస్తోందని కొంతమంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారట.

మనసు మీద వయసుకు వున్న అదుపు చెప్పగలనా..? మల్లెల మాసమా..మంజుల హాసమా? విరిసిన పింఛమా? విరుల ప్రపంచమా? ఎంతో బతిమాలినా? ఇంతేనా అంగనా? ఇలాంటి లైన్ లు అన్నీ భావకవిత్వంతో పరిచయం వున్న జనరేషన్ కు కొత్తగా అనిపించడం, అలాగే ఈ తరానికి ఆ సాహిత్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం అని కూడా అనిపిస్తుంది. మొత్తం మీద వున్న కొద్దిపాటి కమర్షియల్ స్పేస్ లోనే త్రివిక్రమ్-సిరివెన్నెల-థమన్ ముగ్గురు కలిసి ఓ క్లాసిక్ సాంగ్ ను అందించే ప్రయత్నం చేశారు.
ఏదేమైనా ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక ఈ పాట విన్న బన్ని ఫ్యాన్స్ ఈ పాట ఏ సందర్భం లో వస్తుందా..? అంటు రక రకాల ఇమాజినేషన్స్ చేసుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: