అల్లరి సినిమా తో డైరెక్టర్ గా ఒక కొత్త ట్రెండ్ ని క్రియోట్ చేసిన రవిబాబు ఆ తర్వాత నచ్చావులే, అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ వంటి వినూత్నమైన కథలతో సినిమాలను తెరకెక్కించాడు. పార్టీ సినిమాని తర్వాత థ్రిల్లర్, హర్రర్ జోనర్స్ లో సినిమాలను తీయడం మొదలు పెట్టాడు. అనసూయ, అమరావతి, మనసారా..వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రవిబాబు తన మొదటి సినిమా నుండి సినిమా పోస్టర్ విషయంలో ఆసక్తిని రేకెత్తించడం అలవాటైపోయింది. అయితే అది రాను రాను మరీ బోర్ కొట్టి ప్రేక్షకులు రవిబాబు సినిమా అంటే ఒక అంచనాకి వచ్చేలా చేసింది. అందుకే అవును, అవును-2 పెద్దగా సక్సస్ ను అందుకోలేకపోయాయి.

ఇక థ్రిల్లర్, హర్రర్ సినిమాలతో తనకంటూ ఓ మార్క్ తయారుచేసుకున్న రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆవిరి. ఇటీవలే రెండు పోస్టర్స్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ 1 అని పేరు పెట్టినా, దేనికదే వుండేలా కట్ చేసినట్లు సాధారణంగా కనిపిస్తోంది. ఆవిరి అన్న పేరు పక్కన పెడితే, మళ్లీ అవును సినిమా సీన్లు చూసిన ఫీలింగ్ కలుగుతుందని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ టీజర్ లో ఏమాత్రం కొత్తదనం లేకపోవడమే.

ఓ పెద్ద ఇల్లు, ఇన్విజిబుల్ దెయ్యం, సిసి కేమేరా సీన్లు అన్నీ ఎలా వున్నాయి అంటే రవిబాబు సినిమాలు నచ్చేవారికి కూడా ఈ టీజర్ అంతగా నచ్చడం లేదని టాక్ వినిపిస్తోంది. లడ్డూబాబు, అదిగో సినిమాలతో నాన్ హర్రర్ జోనర్లు తనకు అచ్చిరావు అని రవిబాబు కు క్లియర్ గా అర్థమైంది.. అందుకే మళ్లీ తనకు కలిసి వచ్చిన 'అవును' జోనర్ లోకి దిగిపోయారు. మిగిలిన రెండు టీజర్లు వస్తే, ఈసినిమా ఏ మేరకు వైవిధ్యంగా వుంటుంది అన్నది తెలుస్తుందని అనిపిస్తుంది. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ మీద విడుదల చేయడం ఈసారి విశేషం. అయితే సినిమా కూడా టీజర్ లాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా నిర్మాతగా దిల్ రాజు ఆవిరి అవడం ఖాయమని అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: