దేవుళ్లను పువ్వులతో పూజించడమే ఆనవాయితీ. కానీ ఆ పువ్వులనే దేవతగా పూజించుకునే బతుకమ్మ పండుగను తెలంగాణలో ఉత్సవంలా జరుపుకుంటారు. మహాలయ అమవాస్యనాడు ప్రారంభమయ్యే ఈ పండుగ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంబరాలనంటే ఈ సంబరాల పండగ నేడు ప్రారంభమైంది. తొలిరోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగను తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వరకు వేడుకగా జరుగుతుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఎంతో విలువనిచ్చే కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ బతుకమ్మ పాటను పాడి నటించారు. కందికొండ రాసిన ఆ పాట పూర్తి లిరిక్స్ మీకోసం..

 

 

ఊరువాడా చేరేనంట.. ఊగి ఊగి ఆడేనంటా.. జిమ్మేదారి కోయిలాలో.. కోయిలాలో

ఎదురొచ్చే ఆడబిడ్డ.. మా ఇంటికి..

ఎంగిలి బతుకమ్మ పేర్చే శ్రీలక్ష్మీకి..

తలనెక్కి బైలెల్లే.. శివపార్వతి

అగ్గితోటి అందుకునే మా హారతి..

ఊరు చెరువు చెట్టు మీద .. ఊగి ఊగి ఆడేనంటా ||

 

 

తీరు తీరు పూవూలంటా.. తిరిగి తిరిగి తెచ్చేరంటా

అరుగు మీద పోసేరంట.. ఆనందంగా పేర్చేరంటా

మట్టినే బోడెమ్మగా మలిచేరంటా.. పుసుపుతో గౌరమ్మగా చేసేరంటా

రంగు గాజులంటా.. రంగు రంగు చీరలంటా

ఆ డప్పు దరవులంటా.. దారెంట మోగేనంటా

పల్లెటూరో పూల ఏరో సూడరారో.. చెల్లెళ్ల చేతుల్లా మెరిసేనంటా

తంగెల్ల గునుగుల్లా బతుకమ్మంటా.. అక్కల్లు అందంగా పాడేనంటా

గళమెత్తి గౌరమ్మా.. పాటలంటా

ఊరు చెరువు చెట్టు మీద .. ఊగి ఊగి ఆడేనంటా ||

 

 

నాయనమ్మ పూసే నంటా.. అరె పసుపు కుంకుమ గడప నిండా

తాత మనుమలు కట్టేరంటా.. మామిడాకులు పందిరి అంతా

తొమ్మిదొద్దులు పూజలు చేసేరంటా.. సత్తుపిండి సంబురంగా దంచేరంటా

పలుగు దునికేనంటా.. ఆ వాగు పొంగెనంటా

తెలంగాణ నేల పచ్చంగ మురిసేనంటా.. చెరువు మెరుపో నీటి పరుగో గంగ పిలుపో

బతుకమ్మ బయలెల్లి పోయేనంటా.. సద్దుల బతుకమ్మ సాగి వెళ్లేనంటా

చేతి నుంచి చెరువులోకి చేరేనంటా.. అలల మీద అమ్మ ఆటలాడేనంటా

సల్లంగ శ్రమజీవుల చూసేనంటా.. మళ్లొచ్చే యేడు తిరిగి వచ్చేనంటా

ఊరు చెరువు చెట్టు మీద .. ఊగి ఊగి ఆడేనంటా ||


మరింత సమాచారం తెలుసుకోండి: