మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ కానుకగా విడుదల కాబోతుంది. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ కల్పించే అవకాశం ఉందని సమాచారం. గతంలో కొన్ని తెలుగు సినిమాలకు పన్ను రాయితీని ప్రభుత్వాలు కల్పించిన విషయం తెలిసిందే. 
 
సైరా నరసింహారెడ్డి సినిమా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో తెరకెక్కింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు. సినిమాలో కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ చరిత్రకు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి చరిత్ర కావటంతో వైసీపీ ప్రభుత్వం సైరా సినిమాకు పన్ను రాయితీ కల్పించే అవకాశం ఉందని సమాచారం. 
 
ఇప్పటికే హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలలో సైరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. బుధవారం, గురువారం అన్ని షోలకు టికెట్లు ఇప్పటికే బుకింగ్ అయ్యాయి. 2019 సంవత్సరంలో టాలీవుడ్ లో సాహో సినిమా తరువాత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో విడుదలవుతున్న సినిమా సైరా నరసింహారెడ్డి. నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాకు 270 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 
 
సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మొదలై పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తోనే  ముగుస్తుందని సమాచారం. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: