ఒక సినిమా తీయాలంటే లైట్ మెన్ నుండి దర్శకుడి వరకు ఎంతో మంది కష్టపడుతుంటారు. అయితే సినిమా అనేది ఒక కళ. ఇక్కడ డబ్బు సంపాదన కోసం వచ్చే వారికంటే సినిమా అంటే ప్యాషన్ తో వచ్చే వారే ఎక్కువ. సినిమా దర్శకుడు కావాలన్న ప్రతీ ఒక్కరి కల.. ఏదో ఒకరోజు దర్శకుడిగా తమ పేరును వెండితెర మీద చూసుకోవాలని. అయితే సినిమా తీసినా వారి పేరు సినిమాలో లేకపోవడం వారి దురదృష్టమనే చెప్పాలి.


తాజాగా ఈ సంఘటన బాలీవుడ్ లో జరిగింది. ఇటీవల రిలీజైన హౌస్ ఫుల్ ౪ ట్రైలర్ బాలీవుడ్ జనాల్ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా సగం కంటే ఎక్కువ భాగాన్ని సాజిద్ ఖాన్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. కానీ మధ్యలో అతని మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ ఆరోపణలు రావడంతో చిత్ర నిర్మాతలు అతణ్ణి తప్పించి ,రచయితల్లో ఒకడైన ఫర్హద్ సామ్‌జీకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. దర్శకుడితో సినిమా పూర్తి చేయించారు.


ఐతే ఇప్పుడు పోస్టర్ల మీద, ట్రైలర్లో దర్శకుడిగా ఫర్హద్ పేరు మాత్రమే కనిపించడం బాలీవుడ్ జనాల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మధ్యలో వెళ్లిపోయినప్పటికీ సగానికి పైగా సినిమా తీసిన దర్శకుడి పేరు వేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాజిద్ ఏ కారణంతో సినిమా నుంచి తప్పుకున్నప్పటికీ.. అతడికి సినిమాలో క్రెడిట్ ఇవ్వకపోవడం అన్యాయం అంటున్నారు.దీనిపై హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు.


సాజిద్ దర్శకత్వంలోనే ‘హౌస్ ఫుల్-4’ 60 శాతం చిత్రీకరణ జరుపుకున్నట్లు అతను అంగీకరించాడు. ఐతే నిర్మాణ సంస్థ అతడి పేరును టైటిల్స్‌లో వేయొద్దని, క్రెడిట్ ఇవ్వొద్దని నిర్ణయం తీసుకుందని.. దాన్ని తామందరం గౌరవిస్తున్నామని.. దీన్ని వివాదం చేయొద్దని కోరాడు. వెల్లువెత్తుతున్న విమర్శలను చూసైనా నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: