టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. ఆయన సినిమా కథ ఎలా ఉంటుందో, ఆయన హీరో ఎలా ఉంటాడో సినిమా టైటిల్ ని బట్టి ఖచ్చితంగా ఒక అంచనాకి వచ్చేయవచ్చు. బద్రి, ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మాన్, లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ వరకు హీరో ఎవరైనా తనకు నచ్చినట్టు మాస్ హీరోగా మేకోవర్ చేసి వదులుతాడు. ఇక ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ప్రేక్షకులకు క్లియర్ గా అర్థమవుతుంది. హీరో బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయని. ప్రతి సినిమాలోను తన మార్క్ డైలాగ్స్ తో హీరో రెచ్చిపోవాల్సిందే. నువ్వు నందా అయితే నేను బద్రి..బద్రినాధ్.., ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు..నిన్ను మించిన తోపెవడు లేడిక్కడ.., నేను కొడొతే అదోలా ఉంటుందని ఆడు ఈడు చెప్పడమే తప్ప నాక్కూడా తెలీదు..వంటి డైలాగ్స్ పూరీ మార్క్ ఏంటో చెప్తాయి. ఇప్పుడు అలాంటి డైలాగ్స్ బాలీవుడ్ లో ఒక పాపులర్ హీరోయిన్ చెప్తోంది. 

సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన సెకండ్ ఇన్నింగ్స్ లో 'మర్దాని' తో విజయం సాధించింది.  2014 లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా 'మర్దాని-2' ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్ ను ఫిలిం రీసెంట్‌గా విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. గోపీ పుత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాణి ముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రాణి ముఖర్జీ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ రాయ్ అనే పాత్రలో నటిస్తున్నారు. నేరస్తులపై ఉక్కుపాదం మోపడమే ఆమె వర్కింగ్ స్టైల్. అందుకు ఎంత దూరమైనా వెళ్తుంది. ఈ సినిమాకు అందుకే "వారు ఆపేంత వరకూ ఆమె ఆపదు" అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇక రిలీజ్ చేసిన టీజర్ లో "ఇక నువ్వు ఏ అమ్మాయి పైన అయినా చెయ్యి వేసి చూడు.. ఎలా కొడతానంటే నిన్ను చూసి నీ వయసెంతో కూడా చెప్పలేరు" అంటూ పూరి మార్క్ పవర్ఫుల్ డైలాగ్ చెబుతుంది. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఎప్పుడూ పోలీసు ఆఫీసర్ పాత్రలో హీరోలే నటిస్తూ క్రిమినల్స్ అంతు చూస్తుంటారు. ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో హీరోయిన్ లు నటించే సినిమాలు చాలా తక్కువ అనే విషయం తెలిసిందే. మరి ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందేమో వేచి చూడాలి. ఈ సినిమాలో విక్రమ్ సింగ్ చౌహాన్.. శృతి బాప్నా.. రాజేష్ శర్మ.. సుధాంశు పాండే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 13న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు బాలీవుడ్ మీడియా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: