మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా రేపు విడుదల కాబోతుంది. సైరా నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమాను 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ షాక్ తగిలిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు అదనపు షోలకు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇంకా రాలేదని సమాచారం. 
 
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలకు రెండు రోజుల ముందే అనుమతికి సంబంధించిన పనులు అన్నీ పూర్తవుతాయి. కానీ సైరా సినిమాకు మాత్రం ఇప్పటివరకు అనుమతులు రాలేదు. ఈరోజు ఒకవేళ అధికారులు అనుమతి ఇచ్చినా కూడా ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేయటం అంత తేలిక కాదని సమాచారం. మరికొన్ని చోట్ల థియేటర్ ఓనర్లు బెనిఫిట్ షోల కొరకు టికెట్ కొన్న ఫ్యాన్స్ కు డబ్బులు వెనక్కు ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. 
 
సాధారణంగా బెనిఫిట్ షోల టికెట్లు సాధారణ టికెట్ రేట్ల కంటే నాలుగైదు రెట్లు పెంచి అమ్ముతారు. బెనిఫిట్ షోల వలన డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు కూడా భారీగా ఆదాయం వస్తుంది. కానీ ఇప్పుడు సినిమా కొన్న బయ్యర్లకే బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఉంటాయా ఉండవా అనే స్పష్టత లేదని సమాచారం అందుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈరోజు మధ్యాహ్నంలోపు సైరా సినిమా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని సమాచారం. 
 
నైజాంలో సైరా సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందించాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: