సినిమా ఎక్కడైనా సినిమానే.. బాష మాత్రమే మారుతూంటుంది. నటులు నటించేది ఏ భాషలో అయినా నటనే. కాకపోతే వేరే ప్రాంతాల బాషను, భావాన్ని అర్ధం చేసుకోవాలి అంతే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజీయస్ మూవీ సైరాలో కూడా వివిధ భాషల్లోని క్రేజ్ ఉన్న నటులనే ఎంచుకుంది చిత్ర బృందం. సినిమాలో కంటెంట్ అర్ధం చేసుకుని నటించడంలో వారంతా నిష్ణాతులే. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, తమిళ నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి సుదీప్.. ఇలా వివిధ భాషల్లోని నటులు ఈ సినిమాలో నటించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఇటువంటి సినిమాకు ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు.


సినిమాల్లోని ఆయా పాత్రలకు వివిధ భాషల్లోని నటులను తీసుకోవటం సహజమే. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటీష్ వారిగా తెలుగు నటులే నటించారు. సినిమా రూపం మారడంతో ఒరిజినాలిటీ కోసం భారతీయుడు, లగాన్ వంటి సినిమాలో బ్రిటిషర్లుగా ఇంగ్లీష్ నటులనే తీసుకొచ్చి నటింపజేశారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాలను సినిమాలా కాకుండా తమ కథగా భావించి ఘన విజయం అందించారు. ఇప్పుడొచ్చే అనేక సినిమాల్లో ఆయా భాషల్లోని నటులను తీసుకోవడం సాధరణం అయింది. దక్షిణాది నుంచి నాగార్జున, రానా, మాధవన్.. రీసెంట్ గా నవీన్ పోలిశెట్టి వంటి వారు బాలీవుడ్ మూవీస్ లో భాగమయ్యారు. సైరా.. స్వాతంత్య్ర సమరయోధుని వీరగాధ కావడం, కథా విస్తృతి ఎక్కువ కాబట్టి ఇంతమంది నటులు నటించడం మంచిదే. 


అయితే సినిమాలో వీరి ప్రాధాన్యం కనిపిస్తేనే సగటు ప్రేక్షకుడు ఒప్పుకోగలడు. చారిత్రక గాధ కాబట్టి ఆయా పాత్రలకు ప్రాధాన్యం ఉంటుందనే ప్రేక్షకులు భావిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక కథలో ప్రేక్షకులు లీనమయ్యారంటే ఇంతమంది నటులు తమ పాత్రలకు న్యాయం చేసినట్టే. ఇంతమంది నటుల ఉపయోగం సైరాలో ఎంత ఉందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: