తమిళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ తమిళనాడులో తెలుగు సినిమాలకు ఉండదు. కానీ చెన్నైలో తెలుగు సినిమాలకు ఆదరణ బాగా ఉంటుంది. తెలుగు ప్రజలు ఉండటం తెలుగు సినిమాలపై అక్కడి ప్రేక్షకులకు కొంత క్రేజ్ ఉండటంతో చెన్నైలో తెలుగు సినిమాలు బాగానే రిలీజ్ అవుతాయి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు తమిళంలో బాగానే విడుదలవుతున్నాయి. మగధీర, అరుంధతి, బాహుబలి.. ఇలా మన సినిమాలు అక్కడ విడుదల అవుతున్నాయి. రంగస్థలం కూడా అక్కడ మంచి రెవెన్యూనే సాధించింది.


ప్రస్తుతం దేశమంతా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా గురించే చర్చ నడుస్తోంది. విపరీతమైన బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. తమిళంలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తమిళంలో సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్ బీ చౌదరి ఈ సినిమాను తమిళ హక్కులు తీసుకున్నారు. కాన్సెప్ట్ అందరికీ చేరువయ్యే అవకాశం ఉన్నందున ఈ సినిమాను అక్కడ భారీగా రిలీజ్ చేస్తున్నారు. తమిళ వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి సైరాలో నటించడంతో ఈ సినిమాకు అక్కడ ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నైలో దాదాపు 60 ధియేటర్లలో స్పెషల్ షోలు వేసేందుకు అనుమతి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ ఓ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేసేందుకు పర్మిషన్ రాలేదు. ప్రభాస్ సాహోకు ఇచ్చిన 30 స్పెషల్ షోలే ఇప్పటివరకూ అత్యధికం.


చిరంజీవికి, సైరాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇన్ని షోలకు అనుమతి వచ్చిందంటున్నారు. తమిళ ప్రేక్షకులకు సినిమా కంటెంట్ నచ్చితే అక్కడ మంచి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రేపు విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: