దిలీప్‌రాజా దర్శకత్వంలో జంధ్యాలగారు కనిపించారని ఏపీ మహిళా కమీషన్ మాజీ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు ఆలీ హీరోగా దిలీప్‌రాజా దర్శకత్వంలో విడుదలైన ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమా తెనాలిలో 10వ రోజు ప్రదర్శిస్తున్న థియేటర్‌లో సోమవారం ప్రేక్షకులతో కలిసి ఆమె సినిమా చూశారు. ఆమెతో ఏపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు కూడా సినిమా చూశారు.


సినిమా చూసిన అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘చిత్ర క్లైమాక్స్‌ని దర్శకుడు దిలీప్‌రాజా మలచిన తీరు అద్భుతం. తన భర్త చేతిలో అన్యాయానికి గురైన మరో మహిళకు తన పసుపు కుంకుమను పంచటం అంటే కథలో ఊహించని మలుపు. ఒక కొత్త దర్శకుడు తీసిన చిత్రంలా ఈ చిత్రం లేదు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా దిలీప్‌రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంత మంచి చిత్రం తీసిన చిత్రయూనిట్‌కు అభినందనలు..’’ అన్నారు.


మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇంత అందమైన లోకేషన్లు ఉన్నాయా? అని నాకే అనిపించింది. డెల్టా అందాలన్నీ దర్శకుడు దిలీప్‌రాజా చూపించిన తీరు ఎంతో రమణీయం. ఇలాంటి సినిమాలు మరెన్నో ఆయన రూపొందించాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.


మరో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. ‘‘సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటాడో సినిమాలో వాటన్నింటిని దర్శకుడు దిలీప్‌రాజా ఎంతో చక్కగా పొందుపరిచారు. మల్టీటాలెండెడ్ దర్శకుడిగా దిలీప్‌రాజా సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోగలరని అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అందరూ చక్కగా నటించారు. చిత్రయూనిట్‌కు అభినందనలు..’’ అన్నారు.


ఈ చిత్రానికి కథ, మాటలు, స్కీన్‌ప్లే, దర్శకత్వం వహించిన దిలీప్‌రాజా మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసి అభినందించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సహకారం వల్లే ఇంత మంచి సినిమా తీయగలిగాను. దర్శకుడు సుకుమార్ ఈ కథకు ఎన్నో సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విజయవంతంగా వారం రోజులు పూర్తయ్యాయి. తెనాలిలో 10వ రోజు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే మరో మంచి చిత్రంతో మీ ముందుకు వస్తాను..’’ అన్నారు.


ఆలీ హీరోగా పూర్తీ వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. ‘వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది’ అనేది ట్యాగ్‌లైన్. పెదరావూరు ఫిలిం సిటీ సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ పతాకంపై దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రదీప్ దోనేపూడి, మన్నే శివకుమారి ఈ చిత్రానికి సహనిర్మాతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: