ఏదైనా భారీ బడ్జెట్ సినిమా రిలీజవుతుందంటే.. ముందుగా నిర్మాతలు మంచి రివ్యూలు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు సినిమాల ఫలితాలపై రివ్యూల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే కొన్ని సినిమాలు రివ్యూలకు అతీతంగా కలెక్షన్లు సాధిస్తుంటాయి. అలాంటివి చాలా రేర్. ఇలాంటి నేపథ్యంలో ఏ నిర్మాత అయినా సినిమాకు ఫస్ట్ టాక్ సూపర్ హిట్ గా రావాలని కోరుకుంటారు.


కానీ ఇప్పుడు మాత్రం ప్రతి నిర్మాత మొదటి రివ్యూ నెగిటివ్ గా రావాలని కోరుకుంటుంటారు. అదేంటి అలా అంటారు అంటారా.. అదంతే.. అదంతా విదేశీ సమీక్షకుడైన ఉమైర్ సంధు స్పెషాలిటీ. ఆయన ప్రతి తెలుగు సినిమాకు అంటే ప్రతి భారీ బడ్డెట్ సినిమాకు ముందుగా రివ్యూ ఇస్తాడు. సినిమా విడుదలకు ముందు రోజే రివ్యూ ఇవ్వడం ఈ ఉమైర్ సంధు ప్రత్యేకత.


ప్రఖ్యాత ఫిల్మ్ క్రిటక్ గా ఆయనకు పేరు.. కానీ..ఆయన ఇచ్చే రివ్యూలు ప్రజాతీర్పుకు పూర్తి వ్యతిరేకంగా ఉండటం ఇప్పటివరకూ ఆనవాయితీగా వస్తోంది. ఆయన ఫలానా సినిమా బంపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చాడంటే ఇక ఆ నిర్మాత గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నట్టే. ఇప్పుడు సైరా విషయంలోనూ అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. సైరా సినిమా అద్భుతంగా ఉందని నిన్ననే ఉమైర్ సంధు తన రివ్యూ ప్రకటించాడు.


ఉమైర్ సంధు రివ్యూ చూసినప్పుడే మెగా ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళనపడ్డారు. ఏంటి.. ఈ ఉమైర్ సంధు సినిమా బావుందంటున్నాడు.. కొంపదీసి సైరా ఫట్టవుతుందా అంటూ భయపడ్డారు. ఇప్పుడు వారి అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఉమైర్ సంధు సెంటిమెంట్ మరోసారి నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో అజ్ఞాతవాసి సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. అంటే ఉమైర్ సంధుకు రివ్యూ సెంటిమెంట్ సైరాకు కూడా వర్కవుట్ అయినట్టే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: