మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 285 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఐదు వేల థియేటర్లలో విడుదల చేశారు. 
 
కానీ ఈ సినిమాకు రిలీజ్ రోజే భారీ షాక్ తగిలింది. సైరా సినిమా మార్నింగ్ షో పూర్తి కాకముందే కొన్ని పైరేటెడ్ వెబ్ సైట్లలో సైరా సినిమా అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా కావటంతో పైరసీ వలన కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. సైరా చిత్ర యూనిట్ వీలైనంత తక్కువ సమయంలో పైరేటెడ్ లింక్ లను తొలగించటానికి ప్రయత్నాలు చేస్తే మంచిది. 
 
సైరా సినిమాను కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించటం జరిగింది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితంపై ఇప్పటివరకు ఏ సినిమా రాకపోవటం ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పవచ్చు. దాదాపు పదేళ్ల క్రితమే ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను పరుచూరి బ్రదర్స్ చిరంజీవికి వినిపించారు. 
 
కానీ చిరంజీవి అదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్లటంతో ఈ సినిమా కథ మరుగున పడింది. చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇద్దామని భావించినా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఈరోజు విడుదలైన సైరా సినిమా తుది ఫలితం ఏమిటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి తరువాత సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: