ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 గెటప్స్ తో అలరించబోతున్నాడు చియాన్ విక్రమ్. ఈ వార్త గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిందని సమాచారం. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక నటి వేయగలిగింది ఇప్పటివరకూ 12 గెటప్పులు మాత్రమే. అది కూడా ప్రియాంక చోప్రా 'వాటీజ్ యువర్ రాశీ' అనే సినిమాలో ఈ 12 గెటప్పులు వేసింది. ఈ సినిమా 2009లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అంతకుముందు 2008 లో వచ్చిన దశావతారం సినిమాలో కమల్ హాసన్ 10 గెటప్పులు వేశారు. తమిళ స్టార్ హీరో శివాజీ గణేషన్ నటించిన క్లాసిక్ సినిమా నవరాత్రి లో 9 గెటప్పులు వేసిన విషయం తెలిసిందే. ఇక హాలీవుడ్ లో అయితే తక్కువేనని చెప్పాలి. ఇప్పుడు వీళ్లందరి రికార్డ్ ను బ్రేక్ చేస్తు విక్రమ్ ఏకంగా 25 పాత్రల్లో కనిపించనున్నాడన్నది కోలీవుడ్ హాట్ న్యూస్.

ఒకటి కాదు రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం అన్నది చియాన్ కి కొత్తేమీ కాదు. అపరిచితుడు సినిమాలో రామూ..రెమో.. అపరిచితుడుగా మూడు రకాల వేషాలతో అదిరిపోయే నటనను కనబరిచాడు. ఇప్పటివరకూ విక్రమ్ బెస్ట్ పెర్ఫామెన్స్ అంటే అపరిచితుడు సినిమానే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా 25 పాత్రల్లో నటిస్తున్నాడు. శివపుత్రుడు సినిమాలో మూగవాడిగా అద్భుతమైన నటన కనబరిచిన విక్రమ్ తన కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించారు. ఇక రీసెంట్‌గా వచ్చిన మిస్టర్ కె కె లోను విక్రమ్ నటనకు మంచి పేరొచ్చింది.

ప్రస్తుతం 58వ సినిమాలో 25 గెటప్పుల్లో అదరగొట్టబోతున్నాడన్న వార్త విక్రమ్ అభిమానుల్లో ఒక రేంజ్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. మరో భారీ ప్రయోగానికి సిద్దమైన విక్రమ్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెరుగుతోంది. అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా అక్టోబర్ 4నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవబోతోంది.  7 స్క్రీన్ స్టూడియోస్- వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: