రాఘవ లారెన్స్ కొరియో గ్రాఫర్ గా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా టర్న్ తీసుకొని సూపర్ హిట్స్ కొడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 'ముని' సీక్వెల్స్ గా వస్తున్న కాంచన, గంగ, కాంచన-2, కాంచన-3..ఇలా వరుసబెట్టి ఒకే జోనర్ లో సినిమాలను తెరకెక్కించడమే కాదు అందులో హీరోగా కూడా లారెన్స్ మాంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఒకే జోనర్ లో తీస్తున్నప్పటికి హిట్ కొట్టడం నిజంగా లారెన్స్ కే సాధ్యమవుతోంది. అందుకే ఈ సిరీస్ లో ఒక సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్ళాడు. 

ఇక సౌత్ సినిమాలను రీమేక్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. ఈ మధ్య సొంత కథలను, ప్యాడ్ మ్యాన్ లాంటి వినూత్న కథలను ఎంచుకుని బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకున్నాడు. గత 2-3 ఏళ్ళగా బాలీవుడ్ లో సందడంతా అక్షయ్ దే కనిపిస్తోంది. ఇక అక్షయ్ మళ్ళీ ఇప్పుడు సౌత్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2011లో వచ్చిన కాంచన మూవీ సూపర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ ఇదే సినిమాని లారెన్స్ డైరెక్షన్ లో 'లక్ష్మి బాంబ్' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పుడు లారెన్స్ కి చెప్పకుండా అక్షయ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈ సినిమా నుండి తప్పుకుంటున్నానని లారెన్స్ ప్రకటించాడు. కానీ ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ లారెన్స్ ఈ సినిమాను చేయడానికి ఓకే చెప్పాడు.

ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అక్షయ్ కుమార్, లారెన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్ లలో పోస్ట్ చేశారు. ఇందులో అక్షయ్ తమిళ్ లో లారెన్స్ చేసిన ట్రాన్స్ జెండర్ పాత్రను చేస్తున్నాడు. అక్షయ్ లాంటి ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర పోషిస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాపై బాగా ఆసక్తి పెరిగింది. ఈ ఫస్ట్ లుక్ లో ఒక దేవత విగ్రహం ముందు ఎర్ర చీర కట్టుకుని చూస్తున్న అక్షయ్ లుక్ బాలీవుడ్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఈ ట్రాన్స్ జెండర్ లుక్ కి నెటిజెన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి లారెన్స్ లాగా అక్షయ్ ఈ పాత్రలో ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: