టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుగారి తనయుడు నారా లోకేష్ గతంలో ఎమ్యెల్సీ గా పోటీ చేసి ఆ తరువాత నూతన ఆంధ్రప్రదేశ్ కు పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖా మంత్రిగా పని చేయడం జరిగింది. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా మంగళగిరి నియోజకవర్గం తరపున బరిలో నిలిచిన లోకేష్, వైసిపి ఎమ్యెల్యే రామకృష్ణ రెడ్డిపై ఓడిపోయారు. ఇక ఎక్కువగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఎప్పటికపుడు సమకాలిన రాజకీయ పరిస్థితులపై తనదైన రీతిలో స్పందించే లోకేష్, నేడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి సినిమాపై తన స్పందనను తెలియచేసారు. 'తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. 

ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు'. 'అలానే ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణ్ గారికి, మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి గారి సహా ఈ సినిమాకు పనిచేసిన యూనిట్ సభ్యులందరికీ తన తరపున హార్దిక అభినందనలు' తెల్పుతూ లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి ఎక్కువగా రాజకీయ అంశాలపైనే లోకేష్ ట్వీట్స్ చేస్తూ ఉంటారు, అయితే ఇలా సడన్ గా సైరా నరసింహారెడ్డి పై ఆయన తన స్పందనను ట్వీట్ రూపంలో తెలియచేయడం ఒకింత షాకింగ్ విషయమే అంటున్నారు సినీ విశ్లేషకులు. 

అయితే మొదటి నుండి మెగా మరియు నందమూరి ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఉందని, వారి సినిమాలపై వీరు, వీరి సినిమాలపై వారు ప్రశంసలు కురిపించడం అప్పుడప్పుడు జరిగేదే అని కొందరు అంటున్నారు. ఇకపోతే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ఓవర్ ఆల్ గా యావరేజ్ టాక్ ని సంపాదించి ప్రస్తుతం పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు సాగుతోంది. మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమన్నా, అనుష్క, నిహారిక ప్రత్యేక పాత్రల్లో నటించగా, అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, రవి కిషన్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించడం జరిగింది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: