వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి రోజా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో రోజాకు మంత్రిగా అవకాశం వస్తుందని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా భావించారు. కానీ కొన్ని కారణాల వలన రోజాకు మంత్రి పదవి లభించలేదు. 
 
కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించారు. వైసీపీ ప్రభుత్వం రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ హోదాలో నెలకు 3 లక్షల 82 వేల రూపాయలను కేటాయిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 2 లక్షల రూపాయలు రోజాకు జీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపు కోసం 70 వేల రూపాయలు, అధికారిక క్వార్టర్స్ లో నివాసం లేని పక్షంలో నెలకు 50 వేల రూపాయలు, వాహన సౌకర్యానికి నెలకు 60 వేల రూపాయలు, మొబైల్ ఫోన్ ఛార్జీల కొరకు నెలకు 2వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. 
 
ప్రస్తుతం రోజా ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్ పదవితో పాటు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. రోజాకు ప్రభుత్వం కీలక పదవి ఇవ్వటంతో రోజా జబర్దస్త్ కార్యక్రమానికి దూరం అవుతారని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజాకు జబర్దస్త్ షో మానేసి పార్టీ బాధ్యతలను నిర్వర్తించాలని  చెప్పినట్లు వార్తలు వినిపించాయి. 
 
గత ఐదేళ్లలో వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే రోజా చాలా సందర్భాల్లో గళం వినిపించింది. వైసీపీ పార్టీ విజయం కొరకు ఎంతగానో కృషి చేసింది. రెండున్నర సంవత్సరాల తరువాత ఏర్పడే కొత్త కేబినేట్ లో రోజాకు తప్పకుండా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజా ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: