విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. ప‌ద్మ‌భూష‌ణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌నున్నారు. 6 అక్టోబ‌ర్ 2019 (ఆదివారం) ఉద‌యం 10.15 నిమిషాల‌కు తాడేప‌ల్లిగూడెం య‌స్.వి.ఆర్.స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. `సైరా:న‌ర‌సింహారెడ్డి` ఘ‌న‌విజ‌యం నేప‌థ్యంలో ప్ర‌చారకార్య‌క్ర‌మాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నందుకు నిర్వాహ‌కులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


ఈ సంద‌ర్భంగా శ్రీ ఎస్వీ రంగారావు సేవాస‌మితి ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. ``మెగాస్టార్ చిరంజీవి `సైరా: న‌ర‌సింహారెడ్డి` చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న ఆనందంలో ఉన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా న‌టించారు. ఐదు భాష‌ల్లో రిలీజైన సైరా విజ‌యం తెలుగు వారి స‌క్సెస్ గా భావిస్తున్నాం. ఒక గొప్ప చారిత్ర‌క విజ‌యం అందుకున్న‌ సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆయ‌న విచ్చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట కోసం క‌మిట్‌మెంట్‌తో మెగాస్టార్ ఈ ఆవిష్క‌ర‌ణ‌కు విచ్చేస్తున్నారు. ఓవైపు సైరా ప్ర‌చారంలో బిజీగా ఉండీ ఆయ‌న మాట‌కు క‌ట్టుబ‌డి విచ్చేయ‌డం సంతోషాన్నిస్తోంది. ఆదివారం ఉద‌యం గ‌న్న‌వ‌రం నుంచి తాడేప‌ల్లి చేరుకుని విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. అటుపై తిరిగి మెగాస్టార్ హైద‌రాబాద్ కి విచ్చేస్తారు`` అని తెలిపారు.


ఎస్వీఆర్ పూర్తి పేరు సామర్ల వెంకటరంగారావు. 3 జులై 1918లో జన్మించారు. 18 జులై 1974 లో పరమపదించారు. కృష్ణాజిల్లా, నూజివీడులో జన్మించిన  రంగారావు కొన్నిరోజులు మద్రాస్, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో నటించారు.  షేక్ స్పియ‌ర్ డ్రామాల్లో న‌టించిన అనుభ‌వంతోనే సినీన‌టుడు అయ్యారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేసిన ఆయ‌న‌ నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు- తమిళ- కన్నడ, మలయాళ-హిందీ భాషల్లో 300 పైగా చిత్రాల్లో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: