దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ స్టేచర్ ఈనాటికీ ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం 'శివ'. తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఒక మాస్టర్ పీస్.అలాంటి ఈ సినిమా విడుదలై నేటికి 30 ఏళ్లు కావొస్తోంది. వాస్తవంగా ఈ సినిమాకు ముందు వర్మ ఎవరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం లేదనే చెప్పాలి. అమీర్ పేట్ లో ఒక వీడియో లైబ్రేరి నడుపుకుంటున్న వరం విపరీతంగా సినిమాలు చూస్తుండేవారు. ఆ సినిమాల ప్రభావం తోనే తను విజయవాడలో చదివిన సిద్దార్థ కాలేజ్ లో జరిగిన సంఘటనల ఆధారంగా శివ సినిమా కథను తయారు చేసుకొని నాగార్జునని కలిసి కథ చెప్పి ఒప్పించడమేకాదు ఈ కథను తెరకెక్కించడానికి దర్శకుడిగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. 

ఇక నాగార్జున దర్శకత్వ శాఖలో అనుభవం లేని వర్మకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వగానే అందరు ఆశ్చర్యపోయారు. కానీ వర్మ మాత్రం శివ సినిమాతో ఇండస్ట్రీలో అందరికి షాకిచ్చాడు. ఇక శివ రిలీజై 30 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్బంగా వర్మ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. 'నాగార్జునా.. ఇవాళ మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టిన రోజు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో దర్శకులుగా రాణిస్తున్న,రాణించాలనుకుంటున్న చాలమందికి శివ సినిమా ఒక గైడ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమాలోని కెమెరా వర్క, సౌండ్ డిజైనింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తుంటాయి. 

అందుకే ఈ సినిమా ఖచ్చితంగా ఎప్పటికీ ఒక క్లాసిక్ గా మిగిలిపోతుండనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమాతోనే నాగార్జున, రామ్ గోపాల్ వర్మల పేర్లు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమా సృష్టించిన అలజడితో అప్పటి వరకు తెలుగు పరిశ్రమలో చలామణీలో ఉన్న అనేక సాంప్రదాయ పద్దతులకు చెక్ పడి కొత్త ఒరవడి మొదలైంది. ముఖ్యంగా షాట్ డివిజన్ లో కొత్త ట్రెండ్ సృష్టించారు వర్మ. అలాగే క్లోజ్ షాట్స్ తీసే విధానంలో కూడా ఒక కొత్త విధానాన్ని పరిచయం చేశారు. అందుకే నాగార్జున శివ సినిమాకి ముందు ఎన్ని సినిమాలలో నటించినా ఈ సినిమా నాగ్ కెరీర్ లో ప్రత్యేకం. అలాగే వర్మ శివ సినిమా తర్వాత బాలీవుడ్ మెగాస్టార్  అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళతో ఇన్ని సినిమాలు తెరకెక్కించినా శివ సినిమానే కెరీర్ బెస్ట్ అని చెప్పక తప్పదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: