శరన్నవరాత్రులలో దుర్గాష్టమికి ఒక ప్రత్యేకమైన  ప్రాముఖ్యత ఉంది. కొన్ని ప్రాంతాలవారు కాళీమాత నుదుటి నుండి దుర్గాదేవి ఉద్భవించిందని నమ్ముతారు. కనకదుర్గమ్మను కాళీమాతగా చండీదేవిగా పూజిస్తారు. దుర్గాష్టమి నాడు 64 యోగినులను దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వరాహి ఇంద్రాణి, ఛాముండి అనే ఎనిమిది శక్తి రూపాలలో ఈరోజు అమ్మను ఆరాధిస్తారు. 

దుర్గాష్టమి రోజున ఉపవాసం ఉండి అమ్మను ఆరాధించాలని చెపుతారు. దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి. అష్టమినాడు అమ్మ మహిషాశురుని వధించడమే కాకుండా రక్తబీజుడు దుర్గామాసురుడు చండముండులు లాంటి ఎందరో రాక్షసులను సంహరించి ఉగ్ర రూపంతో దర్శన మిస్తుంది. 

ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మను కొలిస్తే అన్ని కోరికలు తీరుతాయి అని అంటారు. ‘సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే’ అంటూ ఆమ్మ ఈరోజు కొలిచే భక్తులకు అన్ని కోరికలు తీరుతాయి. ఈశక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివుని యొక్క శక్తి రూపమే "దుర్గ" యని ఆదిశంకరాచార్యుల వారు వారి వాక్కులో పేర్కొన్నారు. 

ఈ అమ్మవారు రాత్రి రూపం పరమేశ్వరుడు పగలు రూపం కలిగి ఉంటారని అంటారు. దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమౌతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియచెస్తోంది.  పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయమందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందాడు. దేవేంద్రుడు దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందకలిగినాడు. ఈరోజు ఎర్రని పువ్వులతో అమ్మని అర్చిస్తారు. ఈరోజు అమ్మవారికి గారెలు పరవాణ్ణం నివేదనగా సమర్పిస్తారు. అమ్మను భక్తితో పూజించి అమ్మ కరుణకు పాత్రులు అవుదాం..



మరింత సమాచారం తెలుసుకోండి: