ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తొమ్మిద వరోజున మహర్నవమి దేశమంతటా జరుపుకుంటూ ఈరోజు అమ్మ వారిని మహిషాసుర మర్ధిని అవతారంలో పూజలు చేస్తారు. ఈ శరన్నవరాత్రులు ఉత్సవాలలో రామ భక్తిభావం అంతర్లీనంగా కనిపిస్తుంది. ఉత్తర భారతంలో పల్లెలు పట్టణాలలో రామలీల ఉత్సవాలు నెలరోజులు ముందుగానే ప్రారంభం అవుతాయి. 

రామాయణ కాలం నాటికే శ్రీ దేవీ నవరాత్రి పూజలు జరుపుకోవడం సాంప్రదాయంగా కొనసాగుతూ ఉండేది. రావణుడు సీతా దేవిని అపహరించుకుని పోయినప్పుడు శ్రీరాముడు దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. అప్పుడు శ్రీదేవీనవరాత్రి వ్రతాన్ని ఆచరించ వలసిందిగా నారద మహర్షి శ్రీరామచంద్రునికి ఉపదేశించాడు అని అంటారు. ఈ తొమ్మిది రోజులు ‘దేవీనవరాత్రి వ్రతంగా’ శ్రీరాముడు ఆచరించి రావణుడుని సంహరించడానికి శక్తి యుక్తులు పొందాడు అని అంటారు.  
ఈ మహానవమిని దుర్గా నవమి అని కూడ పిలుస్తారు. చెడుపై మంచి విజయంగా జరుపుకుంటారు. దుర్గాదేవి రాక్షసుడు మహిషాసుర మధ్య యుద్ధం యొక్క చివరిరోజు

మహానవమి ప్రారంభమవుతుంది. ఈ మహర్నవమి రోజునాడు దుర్గా మాతను సిద్దిదాత్రి అవతారంలో కూడ అర్చిస్తారు. ఈరోజు ఆమె దక్షిణ హస్తంలో చక్రం పై చేతిలో గద ఎడమ వైపున గల కింది చేతిలో శంఖం పైచేతిలో కమలము ఉంటాయి. నవదుర్గల రూపాలలో ఈరోజు పూజ అందుకుంటున్న అమ్మవారి రూపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈరోజుతో దేవి ఆరాధన పరిపూర్ణం చేసిన తరువాత మాత్రమే భక్తులకు సాధకులకు లౌకిక కార్యాలు అన్నీ సిద్ధిస్తాయని అంటారు. 

 దేవి పురాణంలో చెప్పబడిన కథనం ప్రకారం శివుడుకి ఈమె వల్లనే సిద్ధులు పొందినట్లు చెపుతారు. అంతేకాదు ఈమె కరుణ వల్లనే శివుని అర్ధ శరీరంలో ఆమె చేరడంతో మహా శివుడు అర్ధనారీశ్వరుడు ఆవగలిగాడు అని అంటారు. ఈరోజు నాలుగు భుజాలతో కనిపించే దుర్గాదేవి సింహ వాహనం పై చాల రౌద్రంగా కనిపిస్తుంది. ఈరోజున అమ్మవారికి పులిహోర శనగ వడలు నివేదన చేస్తారు. ఉగ్ర రూపంతో కొలువై ఉన్న అమ్మను నేడు భక్తితో పూజిస్తే ఆమె మనం కోరిన కోరికలు తీర్చే తల్లిగా మారుతుంది అని అంటారు. ఈరోజు అమ్మను భక్తితో పూజించి ఆ తల్లి కరుణా కటాక్షాన్ని పొందుదాం.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: