మెగాస్టార్ చిరంజీవి నటనకు గీటురాళ్లుగా నిలిచిన సినిమాలెన్నో ఆయన కెరీర్ లో ఉన్నాయి. తెలుగు సినిమాల్లో మాస్ హీరోగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చేసి మంచి నటుడిగా నిరూపించుకున్నారు. అలా.. పాత్రలో జీవించిన చిత్రాల్లో మరుపురాని చిత్రం ఆపద్బాంధవుడు సినిమా కూడా ఒకటి. కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా 1992 అక్టోబర్ 9న విడుదలై నేటితో 27 ఏళ్లు పూర్తి చేసుకుంది.

 


చిరంజీవి ఈ సినిమాలో గోవుల్ని పెంచుకుంటూ అనాథగా ఉన్న తనను అక్కున చేర్చుకుని పెంచిన వ్యక్తికి కృతజ్ఞత చూపించే పాత్రలో చిరంజీవి నటించారు. ఊళ్లో ఉబ్బలింగడుగా పేరు తెచ్చుకన్న అమాయకుని పాత్రలో మెప్పించారు. ఈ సినిమాలో చిరంజీవి శివుడుగా చేసే నాట్యంతో మైమరిపిస్తారు. పిచ్చాసుపత్రిలో పిచ్చోడిగా నటించారు అనేకంటే ఆ పాత్రలో జీవించారనే చెప్పుకోవాలి. ఆపాత్రలో చిరంజీవి నటనకు ఆ ఏడాది ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును అందుకున్నారు. ‘ఈ సినిమాలో చిరంజీవి నటన రాబోయే నటులకు ఓ గ్రంధాలయం’ అని చిత్ర దర్శకుడు కె.విశ్వనాధ్ అన్నారంటేనే ఆయన నటన ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి ప్రాంతాలను అద్భుతంగా తెరకెక్కించి మంచి ఫీల్ తీసుకొస్తారు దర్శకులు. సినిమాలో కీరవాణి పాటలు అన్నీ వీనులవిందుగా ఉంటాయి.

 


పూర్ణోదయా బ్యానర్ పై ఏడిద నాగేశ్వరారావు నిర్మించిన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయింది. ఘరానామొగుడు వంటి మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో సినిమాలో కంటెంట్ ఉన్నా ఆడలేదు. అప్పటికి ఐదేళ్ల తర్వాత చిరంజీవి మాస్ కంటెంట్ నుంచి కథా ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఈ సినిమా విడుదలై ఉంటే మంచి హిట్ అయ్యేదని అభిమానులు ఇప్పటికీ అనుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: