కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ ‘కళాబంధు’గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. ‘సైరా’ బృందాన్ని సన్మానించి అభినందించారు. 


ఈ సందర్భంగా సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘150 చిత్రాలు చేసిన చిరంజీవికి అవన్నీ ఒక ఎత్తయితే 151వ సినిమా ‘సైరా’ మరో ఎత్తు. బ్రిటీషువారిని గడగడలాడించిన స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను తీసుకుని తన సత్తా ఏంటో భారతదేశానికి చిరంజీవి చాటిచెప్పారు. ఇలాంటి కథను ఎంచుకోవడమే పెద్ద సాహసం. చిరంజీవి అలాంటి సాహసం చేసి సక్సెస్ అయ్యారు. ఇలాంటి భారీ సినిమాను రామ్ చరణ్ లాంటి కుర్రాడు నిర్మించాడంటే ఆశ్చర్యం కలుగకమానదు. పిల్లలకు మనం నేర్పించాలి. కానీ రామ్ చరణ్ చిన్న వయసులోనే సింపుల్, హంబుల్, డౌన్ టుఎర్త్, అఫెక్షనేట్, ఫినామినల్ పర్సన్. అటువంటి రామ్ చరణ్ ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాడంటే అన్‌బిలీవబుల్. నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నాను. కానీ, రామ్ చరణ్ లాంటి ధైర్యం చేయలేదు. దమ్మున్న, మనసున్న వ్యక్తి రామ్ చరణ్. నటుడిగా చేస్తూనే నిర్మాతగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ నుంచి ఈ మ్యాజిక్ అందరూ నేర్చుకోవాలి. చరణ్ పొగడ్తలు పట్టించుకోడు.


చిరంజీవితో నేను దాదాపు 20 సంవత్సరాల క్రితం స్టేట్‌రౌడి సినిమా నిర్మించాను. ఆ సినిమా హిందీలో డబ్ చేస్తే సూపర్‌హిట్ అయింది. ఆ సినిమా నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఉంది. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ఢిల్లీలో ఇద్దరం ఎంపీలుగా ఉంటూ పక్కపక్కనే ఉండేవాళ్లం. ‘చిరంజీవి అంటే ప్రపంచం మర్చిపోతావేంటి?’ అని నా భార్య ఇందిర అంటూ ఉంటుంది. చిరంజీవి హృదయం, మనసు మంచివి అందుకే తను అంటే నాకు అంత ఇష్టం అని చెబుతుంటా. చిరంజీవి కోసమే ప్రత్యేకంగా ఈ మాల తయారు చేసి తెప్పించా.తమన్నా ఈ సినిమాలో ఎంతో చక్కగా నటించి మెప్పించింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. తమన్నా నుంచి సురేందర్‌రెడ్డి అద్భుతమైన పనితనాన్ని రాబట్టుకున్నారు. నిజంగా సురేందర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. తమన్నా ఈ ఫంక్షన్‌కు రావడం కోసం ఎంతో కష్టపడింది. చెన్నైలో ఉన్న ఆమె హుటాహుటిన ఈ కార్యక్రమం కోసమే హైదరాబాద్‌కు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ముంబై వెళ్లి, అక్కడి నుంచి ఫారిన్ వెళ్తోంది. బిజీ షెడ్యూల్‌లో కూడా నేను పిలవగానే వచ్చిన తమన్నాను అభినందిస్తున్నా. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ చాలా కష్టపడ్డారు. ఇది అందరికీ తెలియజెప్పాల్సిన కథ అంటూ పదేళ్లపాటు చిరంజీవి కోసం ఎదురుచూశారు. వాళ్ల సహనానికి హ్యాట్సాఫ్. నేను నిర్మించిన ప్రతి సినిమాకూ వాళ్లే కథా రచయితలు. వాళ్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కెమెరామెన్ రత్నవేలు తన ప్రతిభ ఏంటో మరోసారి ఈ సినిమాతో చాటి చెప్పారు. అలాగే రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్‌తో పాటు విజయ్ మాస్టర్ కూడా ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఆయనను కూడా అభినందిస్తున్నా. బుర్రాసాయిమాధవ్ తన డైలాగులతో ‘సైరా’ సినిమా స్థాయిని పెంచారు. ఇంకా ఇక్కడికి రాని చిత్రయూనిట్ అందరికీ నా ప్రశంసాభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి. తెలుగు సినీ స్థాయి ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి.’’ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: