టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ అనిపించుకోనప్పటికీ, పర్వాలేదనిపించేలా ప్రేక్షకుల నుండి మార్కులు సంపాదించారు. ఆ తరువాత రెండవ సినిమాగా వచ్చిన గోకులంలో సీత, మూడవ సినిమా సుస్వాగతం సినిమాలు మంచి విజయాలు అందుకుని పవన్ కు హీరోగా పేరు తీసుకువచ్చాయి. వాటి తరువాత కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ నటించిన నాలుగవ సినిమా తొలిప్రేమ సూపర్ హిట్ కొట్టి పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం వచ్చిన తమ్ముడు సినిమా పర్వాలేదనిపించినా, ఆపై పూరి జగన్నాథ్ డెబ్యూ సినిమాగా వచ్చిన బద్రి, అలానే ఎస్జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాలు పవన్ కు సూపర్ డూపర్ హిట్స్ ని అందించడంతో పాటు అప్పట్లో ఆయనకు మంచి క్రేజ్ ని తీసుకురావడం జరిగింది. 

అయితే ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని తానే స్వయంగా గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన జానీ సినిమా, అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి పవన్ విజయాలకు అడ్డుకట్ట వేసింది. ఇక అక్కడి నుండి దాదాపుగా త్రివిక్రమ్ తో జల్సా సినిమా వరకు పవన్ కు సరైన విజయం లభించలేదనే చెప్పాలి. జల్సా మంచి విజయం అందుకున్న అనంతరం, ఆయన నటించిన పులి, తీన్మార్, పంజా సినిమాలు కూడా అతి పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక వాటి తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టి, పవన్ కు కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించడం జరిగింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా ఫ్లాప్ అవ్వగా, అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అత్తారింటికి దారేది సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నటించిన గోపాల గోపాల పర్వాలేదనిపించగా, దాని తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి సినిమాలు అతి పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. 

అయితే గత ఏడాది వచ్చిన అజ్ఞాతవాసి తరువాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్, ప్రస్తుతం తన జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో బిజీ అయ్యారు. పవన్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రిలీజ్ అయి నేటితో 23 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఆయన ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పవన్ కు అభినందనలు తెలియచేస్తున్నారు. అయితే అతి త్వరలో ఆయన రీఎంట్రీ ఖాయమనే వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఇక ఇటీవల మెగాస్టార్ మాట్లాడుతూ, ఎవరైనా దర్శకుడు తనకు, మరియు పవన్ కు సరిగ్గా సరిగ్గా సరిపోయే కథ తీసుకువస్తే ఆయనతో కలసి మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి సిద్ధమని ప్రకటించడం జరిగింది. అంతేకాక కొద్దిరోజులుగా మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ ద్వారా సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. మరి ఈ విషయమై రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: