మన దర్శక, నిర్మాతలు, రచయితలు, హీరోలు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతు మానసికంగా శారీరకంగా శ్రమించి తెలుగు సినిమాని ఖండాంతరాల్లో విస్తరింపజేస్తూ మన తెలుగు సినిమా ఖ్యాతిని, గౌరవాన్ని పెంచుతుంటే..కొన్ని నాసిరకం, నీచమైన సినిమాలు ఆ పేరును పూర్తిగా చెడగొట్టేస్తున్నాయి. తెలుగు సినిమా రిచ్ కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ అన్న ప్రశంసలు దక్కించుకుంటు మన సినిమాని మిగతా భాషల్లో దర్శక నిర్మాతలు పోటీ పడి రీ మేక్ రైట్స్ కొనుక్కుంటు మన సినిమాలని గౌరవిస్తుంటే.. కొందరు మన పరిశ్రమను బూతు పురాణంతో సర్వ నాశనం చేసేస్తున్నారు. అలాంటి సినిమాకి ఉదాహరణ ఆదిత్య ఓం- రేఖ బోజ్ జంటగా నటించిన తాజా చిత్రం దామిని బంగ్లా. రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ సినిమా టీజర్ సర్వం బూతు మయం. కథానాయకుడు ఆదిత్య ఓం  మాటలు.. వాయిస్ ఓవర్ లో వినిపించే లేడీ వాయిస్ మరీ పచ్చి బూతులు మాట్లాడటం వింటుంటేనే అసహ్యం పుడుతుంది. 

ఇలాంటి మాటలు రాసే రచయితకు కనీసం సరస్వతి మీద గౌరవం ఉందా అన్న అనుమానం కలుగుతుంది. కొన్ని మాటలు రాయాలంటే పెన్ను కదలదు. మరి ఇలాంటి రచయితలు ఎలా రాస్తున్నారో ఏ ఉద్దేశ్యంతో రాస్తున్నారో ఏం సాధించాలని రాయాలనుకుంటున్నారో కనీసం వాళ్ళకైనా తెలుసో లేదో అర్థం కావడం లేదు.  అలాంటి సీన్స్ లో నటించి తెరపై కనిపించే నటీనటులకు కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉందా.. లేదా? అన్నదీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరో ఆడవాళ్ళనుద్ధేశించి కించపరుస్తూ అన్న ఓ బూతు మాటను కూడా ఈ టీజర్ లో పరోక్షంగా ఉపయోగించడం మరీ విడ్డూరం. ఇలాంటి బూతు మాటలకు, ఈ విజువల్స్ కి అసలు సెన్సార్ చేయలేదా?.. యూట్యూబ్ లో అలా సెన్సార్ చేయకుండా వదిలేశారా? అన్న సందేహం కలుగుతోంది. 

కాస్త రక్తం కనిపిస్తేనే సెన్సార్ కట్స్ చెప్తున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో దర్శక, నిర్మాతలకి, నటించిన వాళ్ళకైనా క్లారిటీ వుందా? 'డిగ్రీ కాలేజ్' ఏడు చేపల కథ'..ఇలా చెప్పుకుంటు పోతే ఇలాంటి పనికిమాలిన సినిమాలు చాలానే ఉన్నాయి. కనీసం టీజర్ లోనైనా ఇలాంటి వల్గర్ సీన్లతో.. క్లాస్ రూమ్ లోనే స్టూడెంట్స్ కూర్చునే బెంచీలపై కామకేళిలో పాల్గొన్న దృశ్యాల్ని యథేచ్ఛగా చూపించేస్తున్నారు. మరి టీజర్లకు సెన్సార్ ఎందుకు చేయడం లేదు? ఇలాంటి వాటిని ఇలాగే వదిలేస్తే తెలుగు సినిమా పరిస్థితేంటి..వీటిని అడ్డుకునే వాళ్ళు ఇండస్ట్రీలో లేరా. 



మరింత సమాచారం తెలుసుకోండి: