2020 సంక్రాంతి సినిమాల విడుదల తేదీలను అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్స్ ప్రకటించాయి. రెండు సినిమాలు జనవరి 12వ తేదీన విడుదల కాబోతున్నాయి. కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా కూడా జనవరి 12వ తేదీనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు రజినీకాంత్ నటిస్తోన్న దర్బార్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది. 
 
ఇప్పుడు వెంకటేశ్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతుందని సమాచారం. వెంకీమామ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనతో సురేశ్ బాబు తన ఆధ్వర్యంలో ఉన్న థియేటర్ మేనేజర్లకు థియేటర్లకు ఎవరికీ అగ్రిమెంట్ చేసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది. మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే రెండు సినిమాలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. 
 
మరోవైపు ఈ రెండు సినిమాల్ని ఆదివారం రోజు రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా సినిమాలు శుక్రవారం లేదా గురువారం విడుదలవుతుంటాయి. బుధవారం విడుదలై హిట్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ సంక్రాంతికి మొదట విడుదలైన సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తుందనే సెంటిమెంట్ వినిపిస్తూ ఉండటంతో ఇద్దరు హీరోలు ఆదివారం రోజు సినిమా విడుదల చేయటానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలలో ఏదో ఒక సినిమా రిలీజ్ డేట్ మార్చుకోకపోతే మాత్రం రెండు సినిమాలు భారీగా నష్టపోక తప్పదు. వెంకీమామ సినిమా కూడా సంక్రాంతికి విడుదలైతే హిట్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కోత పడే అవకాశాలు ఐతే ఉన్నాయి. సినిమాల నిర్మాతలు అందరూ కలిసి చర్చించుకుని రిలీజ్ డేట్స్ మార్చుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 




మరింత సమాచారం తెలుసుకోండి: